5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-విండీస్ జట్లు ఇవాళ (ఆగస్ట్ 3) జరిగే తొలి టీ20లో తలపడనున్నాయి. ట్రినిడాడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సీనియర్లు రోహిత్, విరాట్‌ల గైర్హాజరీలో హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో భారత్ యువ జట్టుతో బరిలోకి దిగనుంది. పేరుకు యువ జట్టే అయినా జట్టు నిండా చిచ్చరపిడుగులే ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు పటిష్టంగా ఉంది. తుది జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఒక్కో ప్లేస్ కోసం ఒకరిద్దరు పోటీపడుతున్నారు. తుది జట్టును ఎంపిక చేయడం కెప్టెన్, కోచ్‌లకు పెద్ద తలనొప్పే అవుతుంది.
ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే.. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లు భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయమని తెలుస్తుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధసెంచరీలు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ మూడో నంబర్‌పై కర్చీఫ్ వేసుకోగా.. నాలుగో స్థానంలో సూర్యకుమార్, ఐదో ప్లేస్‌లో సంజూ శాంసన్ బరిలోకి దిగవచ్చు. ఇషాన్, శాంసన్‌లు ఇద్దరూ ఫామ్‌లో ఉండటంతో ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కవచ్చని సమాచారం.
ట్రినిడాడ్ కండీషన్స్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరో స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మ బరిలోకి దిగే ఛాన్స్ ఉంటుంది.
ఆల్‌రౌండర్లు హార్ధిక్, అక్షర్ పటేల్‌లకు తమ కోటా ఓవర్లు (4) పూర్తి చేసే సామర్థ్యం ఉంది కాబట్టి, వీరితో కలుపుకుని భారత బౌలింగ్ బలగం ఐదుగా ఉండే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో చహల్‌కు (అక్షర్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరే కాబట్టి కుల్దీప్‌కు అవకాశం దక్కకపోవచ్చు) ఛాన్స్ దక్కనుండగా.. పేసర్లుగా ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉండవచ్చని తెలుస్తోంది. ఒకవేళ టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే మాత్రం తిలక్ వర్మ తన అరంగేట్రం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. మూడో పేసర్ కోటాలో ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment