ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ ఫాంచైజీలో ముసలం చోటు చేసుకుంది. ఆ జట్టు యజమానుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా, పారిశ్రామిక వేత్తలు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు.
ఇందులో అత్యధికంగా 48 శాతంతో బర్మన్ వాటాను కలిగి ఉన్నాడు. అదేవిధంగా ప్రీతీ జింటాకు 23 శాతం, నెస్ వాడియాకు 23 శాతం, మిగతా వాటా కరన్ పాల్ అనే వ్యాపారవేత్తకు ఉంది. అయితే అత్యధిక వాటా కలిగిన బర్మన్.. తన షేర్లను ఇతర భాగస్వాములకు తెలియకుండా అమ్మేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తన వాటాలోని 11.5 శాతం కొత్త వ్యక్తికి విక్రయించేందుకు బర్మన్ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తన సహయాజమని అయిన బర్మన్ షేర్లను విక్రయించకుండా అడ్డుకోవాలని ప్రీతీ జింటా చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఈ కేసుపై ఆగస్టు 20న హైకోర్టులో విచారణ జరగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాగా అంతర్గత ఒప్పందాల ప్రకారం.. ఫ్రాంఛైజీలోని వాటాదారుల్లో ఎవరైన తమ షేర్‌ను విక్రయించాలని భావిస్తే తొలుత ఇతర యజమానులకు సమాచారం అందాల్సిందే. అయితే బర్మన్ ఈ ఒప్పందాన్ని ఇప్పుడు ఉల్లంఘించడంతో ప్రీతా జింటా కోర్టు మెట్లు ఎక్కినట్లు వినికిడి.
కాగా ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ ప్రతినిథులు నుంచి మాత్రం ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వార్తలను మోహిత్ బర్మన్ మాత్రం కొట్టిపారేశాడు. "తన షేర్లను విక్రయించే ఆలోచన లేదు" అని క్రిక్‌బజ్‌తో బర్మన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment