ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ సైన్యం (PC: SRH X)
ఐపీఎల్ ఎడిషన్లు మారుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాత మాత్రం మారడం లేదు. 2016లో తొలిసారి టైటిల్‌ను ముద్దాడిన రైజర్స్.. ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గత కొన్ని సీజన్లుగా మరీ పేలవంగా ఆడుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతోంది.
జట్టును చాంపియన్‌గా నిలిపిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను తప్పించిన తర్వాత.. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. కేన్ మామకూ ఉద్వాసన పలికి సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో రైజర్స్ ఐపీఎల్-2023 సీజన్లో మరీ దారుణంగా పద్నాలుగింట 4 మాత్రమే గెలిచి అట్టడుగున నిలిచింది.
ఈ నేపథ్యంలో.. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే కెప్టెన్ వేటలో పడ్డ సన్‌రైజర్స్ యాజమాన్యం మినీ వేలంలో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఆసీస్‌ను జగజ్జేతగా నిలిపిన ఈ పేస్ బౌలర్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది.
ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తమ కెప్టెన్‌గా కమిన్స్‌ను నియమించడం ఖాయమని సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ చెప్పకనే చెప్పిందని అభిమానులు భావిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కూడా ఇదే మాట అంటున్నాడు.
‘‘ప్యాట్ కమిన్స్‌ను కొనుగోలు చేయడం ఎస్‌ఆర్‌హెచ్ తెలివైన నిర్ణయం. అయితే, అతడి కోసం కాస్త ఎక్కువగానే ఖర్చుపెట్టిన మాట వాస్తవమే. కానీ.. సన్‌రైజర్స్‌కు నాయకుడి అవసరం ఉంది.
గత కొన్నేళ్లుగా ఆ వెలితితో జట్టు సమస్య ఎదుర్కొంటోంది. గత సీజన్‌లో చెత్త కెప్టెన్సీ కారణంగా భారీ మూల్యమే చెల్లించారు. ఈసారి ప్యాట్ కమిన్స్ రూపంలో వారికి మంచి ఆటగాడు దొరికాడు. కచ్చితంగా అతడినే కెప్టెన్‌గా నియమిస్తారు. సారథిగా తను తప్పక ప్రభావం చూపుతాడు’’ అని సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment