ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షాకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసేకునేందుకు ఆసక్తి చూపలేదు.
వీటికి తోడు ఈ ముంబై ఆటగాడిలో క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ క్రమంలోనే 25 ఏళ్ల పృథ్వీషా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2018 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన షా.. తొలిసారి ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు దూరంగా ఉండనున్నాడు.
రంజీ జట్టులో కూడా అతడి చోటు ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షాను ఉద్దేశించి ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ హెడ్ కోచ్ ప్రవీణ్ అమ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు. చిన్నవయసులో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చని అమ్రే అభిప్రాయపడ్డాడు.
"పృథ్వీ షా లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడు చేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంటుండటం బాధ కలిగిస్తోంది. ఇప్పటికీ అతడికి ఐపీఎల్‌లో 30 బంతుల్లో ఫిఫ్టీ కొట్టే సత్తా ఉంది. బహుశా చిన్న వయస్సులోనే తనకు వచ్చిన కీర్తీ, డబ్బును సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చు.
భారత క్రికెట్‌లో అతడి జీవితం ఒక కేస్ స్టడీగా ఉపయోగపడవచ్చు. ప్రతిభ ఒక్కటే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లదు. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావం ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలము. అతడికి జరిగింది ఇంకెవరికీ జరగకూడదు. మూడేళ్ల క్రితమే పృథ్వీకి వినోద్ కాంబ్లీ కోసం ఉదాహరణగా చెప్పాను. కాంబ్లీ పతనాన్ని నేను దగ్గరి నుంచి చూశాను.
ఈ తరం కుర్రాళ్లకు కొన్ని విషయాలు నేర్పించడం సులువు కాదు. అతడు 23 ఏళ్ల వయస్సులోనే సుమారుగా రూ. 30-40 కోట్లు సంపాదించి ఉండవచ్చు. ఐఐఎమ్ గ్రాడ్యుయేట్ కూడా అంత సంపాదించరేమో!.
అందుకు అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ధన్యవాదాలు తెలపాలి. అయితే చిన్నవయస్సులో అంత మొత్తం సంపాందించినప్పుడు, కచ్చితంగా దృష్టి మళ్లే అవకాశముంటుంది. అతడు ఈ ఐపీఎల్ వేలాన్ని సానుకూలంగా తీసుకుంటాడని ఆశిస్తున్నాను.
ఇది అతడికి ఒక కనువిప్పు లాంటిది. షాకు ఇంకా చాలా వయస్సు ఉంది. అతడికి ప్రస్తుతం కేవలం 25 ఏళ్ల మాత్రమే అని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా పేర్కొన్నాడు.
చదవండి: ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో తుపాన్ ఇన్నింగ్స్
Comments
Please login to add a commentAdd a comment