Pravin Amre
-
'23 ఏళ్లకే రూ. 40 కోట్లు సంపాదన.. అదే అతడి కెరీర్‌ను దెబ్బతీసింది'
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షాకు ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుతం ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో సతమతవుతున్నందున షాను ఏ ఫ్రాంచైజీ కూడా సొంతం చేసేకునేందుకు ఆసక్తి చూపలేదు.వీటికి తోడు ఈ ముంబై ఆటగాడిలో క్రమశిక్షణ కూడా లోపించింది. ఈ క్రమంలోనే 25 ఏళ్ల పృథ్వీషా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన షా.. తొలిసారి ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు దూరంగా ఉండనున్నాడు.రంజీ జట్టులో కూడా అతడి చోటు ప్రశ్నార్ధకంగానే ఉంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షాను ఉద్దేశించి ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ హెడ్ కోచ్ ప్రవీణ్ అమ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు. చిన్నవయసులో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చని అమ్రే అభిప్రాయపడ్డాడు."పృథ్వీ షా లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడు చేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంటుండటం బాధ కలిగిస్తోంది. ఇప్పటికీ అతడికి ఐపీఎల్లో 30 బంతుల్లో ఫిఫ్టీ కొట్టే సత్తా ఉంది. బహుశా చిన్న వయస్సులోనే తనకు వచ్చిన కీర్తీ, డబ్బును సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చు.భారత క్రికెట్లో అతడి జీవితం ఒక కేస్ స్టడీగా ఉపయోగపడవచ్చు. ప్రతిభ ఒక్కటే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లదు. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావం ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలము. అతడికి జరిగింది ఇంకెవరికీ జరగకూడదు. మూడేళ్ల క్రితమే పృథ్వీకి వినోద్ కాంబ్లీ కోసం ఉదాహరణగా చెప్పాను. కాంబ్లీ పతనాన్ని నేను దగ్గరి నుంచి చూశాను. ఈ తరం కుర్రాళ్లకు కొన్ని విషయాలు నేర్పించడం సులువు కాదు. అతడు 23 ఏళ్ల వయస్సులోనే సుమారుగా రూ. 30-40 కోట్లు సంపాదించి ఉండవచ్చు. ఐఐఎమ్ గ్రాడ్యుయేట్ కూడా అంత సంపాదించరేమో!.అందుకు అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ధన్యవాదాలు తెలపాలి. అయితే చిన్నవయస్సులో అంత మొత్తం సంపాందించినప్పుడు, కచ్చితంగా దృష్టి మళ్లే అవకాశముంటుంది. అతడు ఈ ఐపీఎల్ వేలాన్ని సానుకూలంగా తీసుకుంటాడని ఆశిస్తున్నాను.ఇది అతడికి ఒక కనువిప్పు లాంటిది. షాకు ఇంకా చాలా వయస్సు ఉంది. అతడికి ప్రస్తుతం కేవలం 25 ఏళ్ల మాత్రమే అని ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా పేర్కొన్నాడు.చదవండి: ఇషాన్ కిషన్ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో తుపాన్ ఇన్నింగ్స్ -
ఆమ్రేకు పోటీగా రాథోడ్
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ విక్రమ్ రాథోడ్ టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులోకి వచ్చాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా భారత అండర్-19 జట్టు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచింగ్ పదవికి రాథోడ్ చేసిన దరఖాస్తును గతంలో తిరస్కరించారు. అయినా పట్టువదలకుండా తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రాథోడ్ దరఖాస్తు చేసుకోవడంతో ఇప్పటికే రేసులో ఉన్న ప్రవీణ్ ఆమ్రేకు గట్టి పోటీ ఎదురైంది. ప్రస్తుతం సంజయ్ బంగర్‌పై వ్యతిరేకత రావడంతో.. బ్యాటింగ్ కోచ్ పదవి ఆమ్రే, రాథోడ్ మధ్య రసవత్తర పోటీ నెలకొంది. 'జూనియర్ సెలక్షన్ ప్యానెల్ల చీఫ్‌గా ఉన్న అశిష్ కపూర్‌తో సంబంధం ఉండటంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో అండర్-19, ఎన్సీఏ బ్యాటింగ్ కోచ్ పదవికి రాథోడ్ దూరమయ్యాడు. కాగా, భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవికి రాథోడ్ దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఒక బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం సీనియర్ బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకోవడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని సదరు అధికారి తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతు ఉన్నప్పటికీ.. ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడం అంత సులువేం కాదు. రవిశాస్త్రికి పోటీగా హేమాహేమీలు రంగంలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్‌పుత్, టామ్ మూడీ, మైఖేల్ హెస్సన్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా.. గ్యారీ కిర్‌స్టన్ కూడా బరిలో ఉన్నట్టు సమాచారం. ఇక ఫీల్డింగ్ కోచ్ పదవికి జాంటీరోడ్స్ ఫేవరెట్‌గా ఉన్నాడు. -
బ్యాటింగ్ కోచ్ రేసులో ఆమ్రే..
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఈ మేరకు బ్యాటింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. టీమిండియా కోచింగ్ స్టాఫ్ ప్రక్షాళన షురూ అయిన నేపథ్యంలో ఇందుకు పలువురు మాజీ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రినే తిరిగి కొనసాగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నా, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌పై వేటు ఖాయంగా కనబడుతోంది. గత ఐదేళ్లలో రవిశాస్త్రి, అనిల్ కుంబ్లేలతో కలిసి బంగర్ పని చేసినప్పటికీ భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని పటిష్ట పరచలేకపోయాడనే అపవాదు ఉంది. ముఖ్యంగా నాల్గో స్థానం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉండటంతో బంగర్‌పై బీసీసీఐ ఆసక్తిగా లేదు. ఈ నేపథ్యంలో ఆమ్రే దరఖాస్తు చేసుకోవడంతో అతను ఒక్కసారిగా రేసులోకి వచ్చేశాడు. అనేక మంది భారత క్రికెటర్లకు గురువుగా వ్యవహరించడం ఆమ్రేకు కలిసొచ్చే అంశం. ప్రధానంగా అజింక్యా రహానే, సురేశ్ రైనా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్పులు ఆమ్రే శిక్షణలు రాటుదేలిన వారే. రహానే తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగు పరుచుకునేందుకు ఆమ్రేనే సంప్రదిస్తూ ఉంటాడు.రమాకాంత్ ఆచ్రేకర్ స్కూల్ నుంచి వచ్చి ఆమ్రే.. కొంతకాలంగా యూఎస్ఏ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. మరొకవైపు ఐపీఎల్లో రెగ్యులర్‌గా కోచింగ్ సర్క్యూట్లో ఉంటూ తన బ్యాటింగ్ పాఠాలు చెబుతూనే ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్లో రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీలతో కలిసి ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేశాడు. టీమిండియా కోచింగ్ విభాగంలో మార్పులు అవసరమని భావించిన బీసీసీఐ.. అందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జూలై 30వ తేదీ సాయంత్ర ఐదు గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆపై కపిల్‌దేవ్ నేతృత్వంలోన క్రికెట్ సలహా కమిటీ టీమిండియా కోచింగ్ బృందాన్ని ఎంపిక చేస్తుంది. -
ఆ ఇన్నింగ్స్ వెనుక 'మాస్టర్ ప్లాన్'!
ఇండోర్:న్యూజిలాండ్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు భారీ పరుగుల సాధించడంలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజింక్యా రహానే పాత్ర వెలకట్టలేనిది. 381 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్పర్ల సాయంతో 188 పరుగులు సాధించాడు. అయితే డబుల్ సెంచరీని స్వల్ప దూరంలో కోల్పోయిన రహానే సుదీర్ఘ ఇన్నింగ్స్ లో బౌన్సర్లు అతనికి పరీక్షగా నిలిచాయి. ఈ క్రమంలోనే మొదటి రోజు ఒక బంతి రహానే హెల్మెట్ ను తాకింది. అక్కడ ప్రమాదం ఏమీ జరగకపోయినా, పిచ్ అదనపు బౌన్స్ కావడంతో తన గురువు ఆమ్రేను రహానే సంప్రదించాడట. తన బ్యాటింగ్ టెక్నిక్ ను మెరుగుపరుచుకోవడానికి తనను అజింక్యా రహానే తరచు సంప్రదిస్తూ ఉంటాడని, దానిలో భాగంగానే తొలి రోజు 79 పరుగులతో అజేయంగా ఉన్న రహానే.. ఆ సాయంత్రం తనకు ఫోన్ చేసినట్లు ప్రవీణ్ ఆమ్రే తెలిపాడు. ఇండోర్ పిచ్ లో బంతి అనుకున్నదానికంటే ఎక్కువ బౌన్స్ కావడంతో తనకు ఫోన్ చేసి చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమ్రే వెల్లడించాడు. 'కోల్ కతా టెస్టులో బంతిని పుల్ చేయబోయి రహానే అవుటయ్యాడు. అప్పుడే పుల్ షాట్ ఆడకూడదని రహానే నిర్ణయించుకుని ఉంటాడు. కాగా, ఇండోర్ లో తొలి రోజు ఆట అనంతరం బౌన్సర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడినట్లు నాకు చెప్పాడు. నేను కేవలం ఒకే విషయం చెప్పా. వికెట్ ను కాపాడుకుండా సాధ్యమైనంతసేపు క్రీజ్ లో ఉండమని సలహా ఇచ్చా. అలా చేస్తే పరుగులు వాటింతట అవే వస్తాయని సూచించా. రహానే కోసం బౌన్సర్లను ప్రత్యర్ధి జట్లు సంధిస్తున్నాయి. అతని ఛాతీనే లక్ష్యంగా బంతులు విసురుతున్నారు. ఆ బంతులకు రహానే ఎలా స్పందిస్తాడు అని మాత్రమే వారు ఆ రకంగా గేమ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తరహా బంతులను వాటిని ఆడటం కంటే వదిలేస్తే రహానే సక్సెస్ అవుతాడు. అది నిన్నటి రహానే ఇన్నింగ్స్ లో జరిగింది. రహానే ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేశాడు' ఇదే ఆ మాస్టర్ ఇన్నింగ్స్ కు కారణమని ఆమ్రే తెలిపాడు. గత కొంతకాలంగా బ్యాటింగ్ లో ఎంతో పరిణితి చెందిన రహానే అద్భుతంగా ఆడుతున్నాడంటూ ఆమ్రే కొనియాడాడు.