ఆ ఇన్నింగ్స్ వెనుక 'మాస్టర్ ప్లాన్'!
ఇండోర్:న్యూజిలాండ్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు భారీ పరుగుల సాధించడంలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజింక్యా రహానే పాత్ర వెలకట్టలేనిది. 381 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్పర్ల సాయంతో 188 పరుగులు సాధించాడు. అయితే డబుల్ సెంచరీని స్వల్ప దూరంలో కోల్పోయిన రహానే సుదీర్ఘ ఇన్నింగ్స్ లో బౌన్సర్లు అతనికి పరీక్షగా నిలిచాయి. ఈ క్రమంలోనే మొదటి రోజు ఒక బంతి రహానే హెల్మెట్ ను తాకింది. అక్కడ ప్రమాదం ఏమీ జరగకపోయినా, పిచ్ అదనపు బౌన్స్ కావడంతో తన గురువు ఆమ్రేను రహానే సంప్రదించాడట.
తన బ్యాటింగ్ టెక్నిక్ ను మెరుగుపరుచుకోవడానికి తనను అజింక్యా రహానే తరచు సంప్రదిస్తూ ఉంటాడని, దానిలో భాగంగానే తొలి రోజు 79 పరుగులతో అజేయంగా ఉన్న రహానే.. ఆ సాయంత్రం తనకు ఫోన్ చేసినట్లు ప్రవీణ్ ఆమ్రే తెలిపాడు. ఇండోర్ పిచ్ లో బంతి అనుకున్నదానికంటే ఎక్కువ బౌన్స్ కావడంతో తనకు ఫోన్ చేసి చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమ్రే వెల్లడించాడు.
'కోల్ కతా టెస్టులో బంతిని పుల్ చేయబోయి రహానే అవుటయ్యాడు. అప్పుడే పుల్ షాట్ ఆడకూడదని రహానే నిర్ణయించుకుని ఉంటాడు. కాగా, ఇండోర్ లో తొలి రోజు ఆట అనంతరం బౌన్సర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడినట్లు నాకు చెప్పాడు. నేను కేవలం ఒకే విషయం చెప్పా. వికెట్ ను కాపాడుకుండా సాధ్యమైనంతసేపు క్రీజ్ లో ఉండమని సలహా ఇచ్చా. అలా చేస్తే పరుగులు వాటింతట అవే వస్తాయని సూచించా. రహానే కోసం బౌన్సర్లను ప్రత్యర్ధి జట్లు సంధిస్తున్నాయి. అతని ఛాతీనే లక్ష్యంగా బంతులు విసురుతున్నారు. ఆ బంతులకు రహానే ఎలా స్పందిస్తాడు అని మాత్రమే వారు ఆ రకంగా గేమ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తరహా బంతులను వాటిని ఆడటం కంటే వదిలేస్తే రహానే సక్సెస్ అవుతాడు. అది నిన్నటి రహానే ఇన్నింగ్స్ లో జరిగింది. రహానే ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేశాడు' ఇదే ఆ మాస్టర్ ఇన్నింగ్స్ కు కారణమని ఆమ్రే తెలిపాడు. గత కొంతకాలంగా బ్యాటింగ్ లో ఎంతో పరిణితి చెందిన రహానే అద్భుతంగా ఆడుతున్నాడంటూ ఆమ్రే కొనియాడాడు.