జట్టుతో చేరనున్న పేస్ బౌలర్
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టెస్టు కోసం పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. బుధవారం అతను జట్టుతో చేరతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ట్రావెలింగ్ రిజర్వ్‌లలో ఢిల్లీకి చెందిన హర్షిత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధాన జట్టులోకి రానున్నాడని సమాచారం. నవంబర్ 1 నుంచి భారత్, కివీస్ మధ్య మూడో టెస్టు వాంఖెడే మైదానంలో జరుగుతుంది. హర్షిత్‌కు ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆ్రస్టేలియాకు వెళ్లే భారత టెస్టు టీమ్‌లో చోటు లభించింది. దానికి ముందు ఒక టెస్టులో అతడిని ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
కివీస్‌తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మూడో టెస్టులో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టవచ్చు. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లకు ఎంపికైనా... హర్షిత్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మంగళవారం అస్సాంతో ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన హర్షిత్...ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 24.00 సగటుతో రాణా 43 వికెట్లు పడగొట్టాడు.
విలియమ్సన్ దూరం
వెలింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని అతను ఇప్పుడు మూడో టెస్టునుంచి తప్పుకున్నాడు. విలియమ్సన్ భారత్‌కు రావడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని అతను ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్తగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
సంచలన ప్రదర్శనతో కివీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హడావిడిగా విలియమ్సన్‌ను బరిలోకి దించరాదని బోర్డు భావించింది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. దాని కోసం విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా అందుబాటులో ఉండాలనేదే ప్రధాన కారణం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ గాయం కారణంగా భారత గడ్డపై అడుగు పెట్టనే లేదు.
Comments
Please login to add a commentAdd a comment