జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో ముంబై ఓపెనర్ పృథ్వీ షా భీకర ఫామ్ కొనసాగుతోంది. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు శతకంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుదుచ్చేరితో నేడు జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 152 బంతుల్లో 227 పరుగులు చేసి సంజూ శాంసన్ (212) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బ్రేక్ చేశాడు.
అంతేగాక లిస్టు ఏ క్రికెట్ (పురుషులు)లో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో పృథ్వీ షా ముంబై జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, కేవీ కౌశల్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ద్విశతకాలు సాధించారు.
కాగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పుదుచ్చేరి ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ముంబై ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 10 పరుగులకే పెవిలియన్ చేరగా, ఆదిత్య తారే హాఫ్ సెంచరీ (56)తో ఆకట్టుకున్నాడు. ఇక సూర్యకుమార్ 50 బంతుల్లోనే సెంచరీ (133) పూర్తి చేసుకోగా, పృథ్వీ షా (నాటౌట్) ఐదు సిక్సర్లు, 31 ఫోర్లతో చెలరేగి ఆడటంతో ముంబై జట్టు ప్రత్యర్థికి భారీ టార్గెట్ విధించింది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 457 పరుగులు చేసి, పుదుచ్చేరికి 458 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. విజయ్ హజారే ట్రోఫీలో ఒక జట్టుకు ఇదే అత్యధిక స్కోరు.
Comments
Please login to add a commentAdd a comment