- 35-28తో యు ముంబాపై గెలుపు
- పుణెరి పల్టన్‌కు నాల్గో విజయం
- ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11
హైదరాబాద్, 3 నవంబర్ 2024 : పుణెరి పల్టన్ పీకెఎల్ సీజన్ 11లో నాల్గో విజయం సాధించింది. ఆదివారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబాపై 35-28తో ఏడు పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ అస్లాం ఇనందార్ (10 పాయింట్లు) సూపర్ టెన్ షోతో మెరువగా.. మోహిత్ గోయత్ (9 పాయింట్లు), గౌరవ్ ఖత్రి (7 పాయింట్లు) ఆకట్టుకున్నారు. యు ముంబా తరఫున అజిత్ చవాన్ (9 పాయింట్లు), మంజిత్ (6 పాయింట్లు), ఆమిర్‌మొహమ్మద్ (4 పాయింట్లు) రాణించినా ఆ జట్టుకు సీజన్లో రెండో ఓటమి తప్పలేదు. ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలతో పుణెరి పల్టన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
పుణెరి పల్టాన్ మెరుపుల్
యు ముంబా, పుణెరి పల్టన్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పుణెరి పల్టాన్ తొలి మూడు నిమిషాల్లో 4-0తో దూకుడు చూపించగా.. యు ముంబా నాల్గో నిమిషంలో పాయింట్ల ఖాతా తెరిచింది. యు ముంబా రెయిడర్లు మంజిత్, అజిత్ చవాన్‌లు రాణించటంతో ఆ జట్టు పుంజుకుంది. 10 నిమిషాల ఆట అనంతరం 8-7తో ఆధిక్యంలో నిలిచింది. చివరి పది నిమిషాల్లో పుణెరి పల్టన్ పుంజుకుంది. యు ముంబాను ఆలౌట్ చేసింది. అస్లాం ఇనాందార్, మోహిత్ గోయత్‌లు రెచ్చిపోవటంతో ప్రథమార్థంలో పుణెరి పల్టాన్ ఆరు పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. విరామ సమయానికి పుణెరి పల్టన్ 22-16తో యు ముంబాపై పైచేయి సాధించింది. రెయిడింగ్‌లో యు ముంబా 14 పాయంట్లతో మెరిసింది. పుణెరి పల్టన్ రెయిడింగ్‌లో 11 పాయింట్లే సాధించింది. డిఫెండర్లు రాణించటంతో పుణెరి పల్టన్ పైచేయి సాధించింది.
విరామం తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. తొలి పది నిమిషాల్లో పాయింట్ల కోసం ఇరు జట్లు చెమటోడ్చాయి. చెరో ఆరు పాయింట్లు సాధించచటంతో 30 నిమిషాల అనంతరం 28-22తో పుణెరి పల్టన్‌దే పైచేయిగా నిలిచింది. పుణెరి పల్టన్‌ను ఆలౌట్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని యు ముంబా వెనుకంజలోనే కొనసాగింది. ఆఖరు వరకు జోరు కొనసాగించిన పుణెరి పల్టన్ సీజన్లో నాల్గో విజయం సాధించింది
Comments
Please login to add a commentAdd a comment