బెంగళూరు బుల్స్‌పై పుణేరి పల్టన్ ఘనవిజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పుణేరి పల్టన్ 38 పాయింట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసుకుంది. సొంతగడ్డపై శుక్రవారం జరిగిన ఈ పోరులో పల్టన్ 56–18 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన పల్టన్ ఓవరాల్‌గా 26 రెయిడ్ పాయింట్లు సాధించగా... బెంగళూరు బుల్స్ 11 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది.
డిఫెన్స్‌లోనూ ఆకట్టుకున్న పల్టన్ 15 పాయింట్లతో మెరిస్తే... బుల్స్ 7 ట్యాకిల్ పాయింట్లే సాధించింది. ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసిన పల్టన్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంటే... బుల్స్ ఒక్కసారి కూడా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. పల్టన్ తరఫున రెయిడర్లు ఆకాశ్ షిండే, మోహిత్ గోయత్, ఆర్యవర్ధన్ తలా 8 పాయింట్లు సాధించారు. బెంగళూరు బుల్స్ తరఫున స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది.
తాజా సీజన్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన పుణేరి పల్టన్ 8 విజయాలు, 8 పరాజయాలు, 3 ‘టై’లతో 54 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న బెంగళూరు బుల్స్ 19 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో పట్టిక అట్టడుగున కొనసాగుతోంది. శుక్రవారమే జరిగిన మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 42–38 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది.
పట్నా తరఫున అయాన్ 13, దేవాంక్ 12 పాయింట్లతో రాణించగా... తలైవాస్ తరఫున మోయిన్ 11 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో 18 మ్యాచ్‌లాడిన పైరెట్స్ 11 విజయాలు, 6 పరాజయాలు, ఒక ‘టై’తో 63 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment