పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ (పెషావర్ జల్మీ) ఈ రికార్డును సాధించాడు. బాబర్‌కు ముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది.
గేల్ ఈ మార్కును తాకేందుకు 285 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. బాబర్ కేవలం 271 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్, గేల్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (299 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (303), ఆరోన్ ఫించ్ (327) ఉన్నారు. ఓవరాల్‌గా టీ20ల్లో 10000 పరుగుల మార్కును ఇప్పటివరకు 12 మంది (బాబర్ సహా) క్రాస్ చేశారు. పాక్ తరఫున షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్ ఈ ఘనతను సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10,000 పరుగుల మార్కును తాకిన బాబర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబరే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. బాబర్ ఒక్కడే రాణించడంతో 154 పరుగులకు ఆలౌటైంది.
బాబర్‌తో పాటు రోవ్‌మన్ పావెల్ (39), ఆసిఫ్ అలీ (23) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పెషావర్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు (సైమ్ అయూబ్, జీషన్, సలాంకీల్) డకౌట్లయ్యారు. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, హసన్ అలీ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్ 2, షోయబ్ మాలిక్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment