పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో బాబర్.. 59 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సైమ్ అయూబ్ (38) కాస్త పర్వాలేదనిపించగా.. మొహమ్మద్ హరీస్ (2), హసీబుల్లా ఖాన్ (0), పాల్ వాల్టర్ (19), రోవ్‌మన్ పావెల్ (8) విఫలమయ్యారు. ఆఖర్లో ఆసిఫ్ అలీ (17 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న బాబర్.. ఆతర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీం షా, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, పొట్టి క్రికెట్‌లో 11వ సెంచరీ (284 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకున్న బాబర్.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్‌లో గేల్ అత్యధికంగా 22 సెంచరీలు (463 మ్యాచ్‌ల్లో) చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment