చెన్నై: సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) చేసిన స్కోరు 200. లక్ష్యం అంత పెద్దగా ఉంటే ఛేదించే బ్యాటర్స్‌కు ఆద్యంతం ఒత్తిడే ఉంటుంది. భారీ షాట్లు, మెరుపు ఫిఫ్టీలు ఉండాల్సిందే. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం ఒక్క అర్ధశతకం, ఏ ఒక్కరి విధ్వంసం లేకపోయినా... సమష్టి వీరవిహారంతో కొండంత లక్ష్యాన్ని కరిగించి నాలుగుసార్లు చాంపియన్ చెన్నైకు చెక్ పెట్టింది.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో నెగ్గి తమ ఖాతాలో ఐదో విజయం నమోదు చేసుకుంది. మొదట చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కాన్వే (52 బంతుల్లో 92 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్), రుతురాజ్ (31 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్)తో ఓపెనింగ్ వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. తర్వాత శివమ్ దూబే (17 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో రెండో వికెట్‌కు 44 పరుగులు జతచేశాడు. అనంతరం క్రీజులో వచ్చిన వారు తక్కువే చేసినా తన జోరుతో కాన్వే భారీస్కోరుకు బాటవేశాడు.
కలిసిమెలిసి ధాటిగా ఆడి...
తర్వాత లక్ష్యానికి తగ్గ దీటైన పోరాటం చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. ఇంత పెద్ద లక్ష్యఛేదనలో క్రీజులోకి దిగిన వారంతా భాగస్వాములయ్యారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ (24 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (15 బంతుల్లో 15; 4 ఫోర్లు, 1 సిక్స్), లివింగ్‌స్టోన్ (24 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్సర్లు), స్యామ్ కరన్ (20 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్), జితేశ్ శర్మ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), సికందర్ రజా (7 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్) మెరుపులు జత చేయడంతో పంజాబ్ కింగ్స్ గెలిచింది.
ఆఖరి బంతిపై అందరి దృష్టి
ధాటిగా ఆడుతున్న జితేశ్ 19వ ఓవర్లో భారీషాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ఇక 8 బంతుల్లో పంజాబ్ విజయానికి 15 పరుగులు కావాలి. సికందర్ రజా బౌండరీ, వైడ్, ఓ పరుగుతో 6 పరుగులొచ్చాయి. సమీకరణం 6 బంతుల్లో 9 పరుగులు. పతిరణ వేసిన ఈ ఓవర్లో తొలి మూడు బంతులకు 2 పరుగులే వచ్చాయి. ఉన్నపళంగా ఉత్కంఠ తారస్థాయికి చేరింది. రజా 4, 5 బంతులకు రెండేసి పరుగుల చొప్పున తీశాడు.
ఇక ఆఖరి బంతికి 3 పరుగుల్ని కట్టడి చేసేందుకు ధోని తలమునకలై ఉన్నాడు. కొంత సమయం తర్వాత పడిన ఈ బంతిని రజా స్క్వేర్ లెగ్ దిశగా బాదగా, జడేజా బౌండరీనైతే ఆపాడు. కానీ ఈ లోపే రజా, షారుఖ్‌లు 3 పరుగులు పూర్తి చేయడంతో పంజాబ్ శిబిరం సంబరాలు చేసుకుంది.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (స్టంప్డ్) జితేశ్ (బి) రజా 37; కాన్వే (నాటౌట్) 92; దూబే (సి)షారుఖ్ (బి) అర్ష్దీప్ 28; అలీ (స్టంప్డ్) జితేశ్ (బి) చహర్ 10; జడేజా (సి) లివింగ్‌స్టోన్ (బి) కరన్ 12; ధోని (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–86, 2–130, 3–158, 4–185. బౌలింగ్: అర్ష్దీప్ 4–0–37–1, రబడ 4–0–34–0, స్యామ్ కరన్ 4–0–46–1, చహర్ 4–0–35–1, సికందర్ రజా 3–0– 31–1, లివింగ్‌స్టోన్ 1–0–16–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 42; ధావన్ (సి) పతిరణ (బి) తుషార్ 28; అథర్వ (సి అండ్ బి) జడేజా 13; లివింగ్‌స్టోన్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 40; కరన్ (బి) పతిరణ 29; జితేశ్ (సి) సబ్–రషీద్ (బి) తుషార్ 21; షారుఖ్ (నాటౌట్) 2; రజా (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–50, 2–81, 3–94, 4–151, 5– 170, 6–186. బౌలింగ్: ఆకాశ్ 3–0–35–0, తుషా ర్ 4–0–49–3, తీక్షణ 4–0–36–0, జడేజా 4–0–32–2, అలీ 1–0–10–0, పతిరణ 4–0–32–1.
Comments
Please login to add a commentAdd a comment