ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు (రూ. 18.5 కోట్లు) సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ వదిలించుకోనుందా.. ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఐపీఎల్-2023లో సామ్ కర్రన్ నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పంజాబ్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సైతం పరోక్షంగా సమర్ధించాడు.
ఐపీఎల్ 2024 వేలానికి ముందు పంజాబ్.. కర్రన్‌ను తప్పక వదించుకోవాలని భావిస్తుంటుందని అన్నాడు. కర్రన్.. సీఎస్‌కే తరఫున అడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు పంజాబ్ తరఫున ఆడలేదని, అతనిపై పెట్టిన పెట్టుబడికి కనీస న్యాయం కూడా చేయలేదని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో కర్రన్ ప్రదర్శన చూసి పంజాబ్ యాజమాన్యం తొందరపడిందని , అతనిపై వెచ్చించిన సొమ్ముతో నలుగురు నిఖార్సైన ఆల్‌రౌండర్లను సొంతం చేసుకొని ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు.
కర్రన్‌పై వెచ్చించిన సొమ్ములో పంజాబ్ కనీసం 50 శాతం కూడా రాబట్టలేకపోయిందని, అతనిపై భారీ అంచనాలే పంజాబ్‌ను వరుసగా తొమ్మిదో సారి ప్లే ఆఫ్స్‌కు చేరనీయకుండా చేశాయని తెలిపాడు. గత సీజన్‌లో కర్రన్‌కు కొత్త బాల్ అప్పజెప్పిన పంజాబ్.. అర్షదీప్‌కు అన్యాయం చేసిందని, అర్షదీప్ ఫెయిల్యూర్‌కు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. కొత్త బంతితో కర్రన్ అద్భుతంగా చేయగలిగినప్పటికీ... భారత పిచ్‌లు అందుకు సహకరించవని అన్నాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్‌లో కర్రన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 135.96 స్ట్రయిక్ రేట్‌తో 276 పరుగులు చేసి, 10 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment