పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు! | Punjab-Knocked Out-IPL 2026-Bowling-Fielding Failure Main-Reason | Sakshi
Sakshi News home page

పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు!

May 24 2026 9:36 PM | Updated on May 24 2026 10:16 PM

Punjab-Knocked Out-IPL 2026-Bowling-Fielding Failure Main-Reason

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్ నుంచి కొన‌సాగుతున్న జ‌ట్ల‌లో పంజాబ్ ఒక‌టి. మొద‌ట కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌గా, ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్‌గా 19 సీజ‌న్లుగా ఐపీఎల్ ఆడుతూ వ‌స్తోంది. జ‌ట్టు పేరు మార్చినా, కెప్టెన్లు మారినా పంజాబ్ త‌ల‌రాత మాత్రం మార‌డం లేదు. తాజాగా ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ లీగ్ ద‌శ‌కే ప‌రిమిత‌మైంది. 

అయితే సీజ‌న్ తొలి అంచె పోటీల్లో ఓట‌మి ఎరుగ‌ని పంజాబ్ రెండో అంచె పోటీల్లో అన‌వ‌స‌ర ఒత్తిడికి లోనైంది. త‌ద్వారా వ‌రుస ప‌రాజ‌యాల‌తో చేజేతులా ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను చేజార్చుకుంది. 19 సీజ‌న్లుగా క‌ప్పు కోసం నిరీక్షిస్తున్న పంజాబ్‌కు ఈ ఏడాది కూడా నిరాశ‌నే మిగిల్చింది.

ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్ (2008)లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన పంజాబ్ మ‌ళ్లీ 2014లో ఫైన‌ల్‌కు చేరుకున్న‌ప్ప‌టికీ తుదిమెట్టుపై బోల్తా ప‌డింది. ఆ త‌ర్వాత ష‌రా మాములే అన్న‌ట్లుగా వారి ఆట‌తీరు సాగింది. అయితే ఐపీఎల్ కెప్టెన్ల‌లో ల‌క్కీ కెప్టెన్‌గా పేరున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ 2025 సీజ‌న్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా రావ‌డంతో ఆ జ‌ట్టులో ఆశ‌లు చిగురించాయి. 

జ‌ట్టు త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కా న్ని నిల‌బెట్టుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ప‌దేళ్ల త‌ర్వాత పంజాబ్‌ను మ‌ళ్లీ ఫైన‌ల్ చేర్చాడు. అయితే తుదిపోరులో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకుంది. గ‌త సీజ‌న్ ఇచ్చిన బూస్ట్‌తో ఈ సీజ‌న్‌లో మంచి అంచ‌నాల‌తోనే పంజాబ్ కింగ్స్ బ‌రిలోకి దిగింది. 

అందుకు త‌గ్గ‌ట్టుగానే తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజ‌యాలు (ఒక మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్దు) సాధించి టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. ఇంకేముంది ఈసారి పంజాబ్ టైటిల్ కొడుతుంద‌ని అంతా భావించారు. కానీ రెండో అంచె పోటీలు మొద‌లవ్వ‌గానే అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. 

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేతిలో మొద‌లైన ఓట‌ముల ప‌రంప‌ర వ‌రుస‌గా ఆరు మ్యాచ్‌ల వ‌ర‌కు కొన‌సాగింది. అయితే  ల‌క్నో క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చి విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. 14 మ్యాచ్‌ల్లో ఏడు విజ‌యాలు, ఆరు ఓట‌ములు, ఒక ర‌ద్దుతో 15 పాయింట్ల‌తో ఉన్న‌ప్ప‌టికీ మిగతా జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

అలాగాక రెండో అంచె పోటీల్లో ల‌క్నోతో మ్యాచ్‌కు ముందు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క దానిలో విజ‌యం సాధించినా ఇవాళ పంజాబ్ ప్లేఆఫ్ చేరుకునేది. కానీ అదృష్టం కంటే దుర‌దృష్టంతో ప్ర‌యాణం చేస్తున్న పంజాబ్‌కు ఐపీఎల్ టైటిల్ అంద‌ని ద్రాక్ష‌లానే మిగిలిపోయింది.

వైఫ‌ల్యం వెనుక కార‌ణాలెన్నో!
ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ చేర‌క‌పోవ‌డం వెనుక కార‌ణాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో ప్ర‌ధాన కార‌ణం బౌలింగ్ బ‌ల‌హీనంగా ఉండ‌డం. తొలి అంచె పోటీల్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజ‌యాలు సాధిస్తే అందులో నాలుగు మ్యాచ్‌ల్లో ఛేద‌న‌లో విజ‌యాలు సాధించింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు ఎంత పెద్ద టార్గెట్ విధించినా పంజాబ్ సులువుగా ఆ ల‌క్ష్యాన్ని అందుకునేది. 

అప్పుడు బౌలింగ్‌లో లోపాలు క‌నిపించ‌లేదు. కానీ రెండో అంచె పోటీల్లో సీన్ రివ‌ర్స్ అయింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు బౌలింగ్ వైఫల్యం వ‌ల్లే ఓడిపోయింది. దీనికి తోడు పేల‌వ ఫీల్డింగ్ కూడా పంజాబ్ కొంప‌ముంచింది. చాలా మ్యాచ్‌ల్లో క్యాచ్‌లు జార‌విడ‌వ‌డంపై హెడ్‌కోచ్ పాంటింగ్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఇలా క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లు పంజాబ్ టైటిల్ సాధించే ఒక మంచి అవ‌కాశాన్ని చేజేతులా కోల్పోయింది.

చదవండి: రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు

Advertisement
 
Advertisement
Advertisement