మీ ఆప్షన్‌ ఏది.. ఆరు సిక్స్‌లా.. సెంచరీనా? | Quinton De Kock Interesting Answers | Sakshi
Sakshi News home page

మీ ఆప్షన్‌ ఏది.. ఆరు సిక్స్‌లా.. సెంచరీనా?

Published Thu, Oct 22 2020 5:01 PM | Last Updated on Thu, Oct 22 2020 5:01 PM

Quinton De Kock Interesting Answers - Sakshi

దుబాయ్‌: ప్రస్తుత ఐపీఎల్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, క్వింటాన్‌ డీకాక్‌లు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ ముగ్గురు ముంబై ఇండియన్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌లు చెలరేగుతుంటే, బ్యాటింగ్‌లో డీకాక్‌ సత్తాచాటుతున్నాడు.  ఈ సీజన్‌లో డీకాక్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఇందులో మూడు వరుస హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం. కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో డీకాక్‌(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించి ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.  ముంబై ఇండియన్స్‌ తరఫున వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 2010లో ఈ ఫీట్‌ను సచిన్‌ టెండూల్కర్‌ నమోదు చేయగా, ఆ తర్వాత మరో పదేళ్లకు ముంబై తరఫున ఆ ఘనతను డీకాక్‌ నమోదు చేశాడు. (గంభీర్‌.. ఇప్పుడేమంటావ్‌?)

కాగా, నెటిజన్లతో ఫ్రాంచైజీలు, క్రికెటర్లు ఇంటరాక్ట్‌ అవుతూ మరింత మజాను అందించడానికి సోషల్‌ మీడియా గేమ్‌ను నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా క్వింటాన్‌ డీకాక్‌ చెప్పిన పలు ఇంట్రెస్టింగ్‌ ఆన్సర్స్‌ను ముంబై ఇండియన్స్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌  చేసింది. ఇందులో మీకు బుమ్రాను ఎదుర్కోవడం కష్టమా.. బౌల్ట్‌ను ఎదుర్కోవడం కష్టమా? అనే ప్రశ్న దగ్గర్నుంచీ ఒక ఓవర్లలో ఆరు సిక్స్‌లు కొట్టడం ఈజీనా.. సెంచరీ చేయడం ఈజీనా అనే ప్రశ్నలు ఉన్నాయి. 

పేసర్లలో మీకు బుమ్రా బౌలింగ్‌ కష్టమా.. బౌల్ట్‌ బౌలింగ్‌ కష్టమా అంటే బుమ్రాను ఎంచుకున్న డీకాక్‌.. ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడం కంటే సెంచరీ చేయడం వైపే వెళతానని సమాధానం చెప్పాడు. ఇక గ్లౌజ్‌లు లేకుండా బ్యాటింగ్‌ చేస్తారా లేక ప్యాడ్లు లేకుండా బ్యాటింగ్‌ చేస్తారా అనే దానికి రెండో ఆప్షన్‌ ఎంచుకున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ 20 సెంచరీలు సాధించిన డీకాక్‌.. కొన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చాడు. ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో ఎదురైన ప్రశ్నలకు ఏదో సమాధానం చెప్పామన్నట్లు కాకుండా కాస్త ఆలోచించి మరీ ఆప్షన్లు ఎంచుకున్నాడు డీకాక్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement