న్యూజిలాండ్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్రకు బంపరాఫర్ దక్కింది. కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో తొలిసారి అతడు చోటు దక్కించుకున్నాడు.
గత ఏడాది కాలంగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న రచిన్‌కు బోర్డు ఈ మేరకు సముచిత స్థానం కల్పించింది. 2024- 25 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రతిపాదిత జాబితాలోని 20 మంది ఆటగాళ్లలో 24 ఏళ్ల రచిన్‌కు చోటు ఇచ్చింది.
బెంగళూరు మూలాలు
భారత్‌లోని బెంగళూరు మూలాలు ఉన్న రచిన్ రవీంద్ర స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గతేడాది కివీస్ తరఫున అతడు 578 పరుగులు సాధించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ఆట తీరుతో ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్.
అంతేకాదు.. ఈ ఏడాది మార్చిలో.. ప్రతిష్టాత్మక సర్ రిచర్డ్ హాడ్లీ మెడల్ అందుకున్నాడు. తద్వారా ఈ మెడల్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడుతూ తాజాగా సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా రచిన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని.. ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బ్లాక్‌క్యాప్స్ తరఫున ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని.. ఇప్పుడిలా కాంట్రాక్టు దక్కించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
రూ. 1.8 కోట్లు
కాగా రచిన్ రవీంద్రతో పాటు బెన్ సియర్స్, విల్ ఓ రూర్కే, జాకోబ్ డఫీలు కూడా తొలిసారి న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించారు.
న్యూజిలాండ్ తరఫున ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడిన రచిన్ రవీంద్ర 519 పరుగులు చేశాడు. ఇక 25 వన్డేలు ఆడిన అతడి ఖాతాలో 820 పరుగులు ఉన్నాయి.
ఇందులో మూడు సెంచరీలు. కాగా ఐపీఎల్‌లో రచిన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది వేలంలో రూ. 1.8 కోట్లకు అతడు అమ్ముడుపోయాడు.
ఇక 23 టీ20 ఆడిన రచిన్ 231 పరుగులు చేయగలిగాడు. అదే విధంగా.. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా 10, 18, 13 వికెట్లు పడగొట్టాడు. కాగా సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది సంబంధిత క్రికెట్ బోర్డు, క్రికెటర్ల మధ్య కుదిరే వార్షిక ఒప్పందం. అందుకు అనుగుణంగానే ప్లేయర్ల పారితోషికం, సదుపాయాలు ఉంటాయి.
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 25గానూ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:
ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్.
చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ!
Comments
Please login to add a commentAdd a comment