రాహుల్ ద్రవిడ్ (PC: BCCI/ICC)
టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత అతడి భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందనుకుంటే బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు.
కాగా టీ20 వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వైదొలగగా.. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ద్రవిడ్‌ను ఒప్పించి మరీ ఈ పదవిని కట్టబెట్టారు.
ఈ క్రమంలో రాహుల్ మార్గదర్శనం, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం చేతులెత్తేసింది. టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన భారత జట్టు.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.
ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం అతడి సేవలను మరోమారు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతడు గనుక సుముఖంగా లేకపోతే వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రాహుల్ ద్రవిడ్‌ను తమ మెంటార్‌గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. మెంటార్‌గా గౌతం గంభీర్ స్థానంలో ద్రవిడ్ అయితే బాగుంటుందని ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఆలోచిస్తోందట.
కాగా లక్నో మెంటార్‌గా సేవలు అందించిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తిరిగి కోల్‌కతా నైట్‌రైడర్స్ గూటికి చేరుకున్నాడు. ఇక ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆవేశ్ ఖాన్ వదులుకున్న లక్నో ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌తో డైరెక్ట్ స్వాప్ ద్వారా దేవ్‌దత్ పడిక్కల్‌ను దక్కించుకుంది. కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్‌ను నియమించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment