జడేజా చక్కటి ఇన్నింగ్స్‌.. భారత్‌కు ఆధిక్యం | Rain plays spoilsport in 3rd session, ENG trail by 70 runs | Sakshi
Sakshi News home page

Eng vs Ind: జడేజా చక్కటి ఇన్నింగ్స్‌.. భారత్‌కు ఆధిక్యం

Published Sat, Aug 7 2021 3:42 AM | Last Updated on Sat, Aug 7 2021 12:03 PM

Rain plays spoilsport in 3rd session, ENG trail by 70 runs - Sakshi

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లలో 278 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 95 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (214 బంతుల్లో 84; 12 ఫోర్లు) తొలి సెషన్‌లో నిలబడగా... తర్వాత రవీంద్ర జడేజా (86 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఓలీ రాబిన్సన్‌ 5 వికెట్లు పడగొట్టగా, అండర్సన్‌కు 4 వికెట్లు లభించాయి. అయితే  వాన మ్యాచ్‌కు పదేపదే అంతరాయం కలిగించడంతో మూడో రోజు కూడా 49.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌ 11.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌ (11 బ్యాటింగ్‌), డామ్‌ సిబ్లీ (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

జడేజా ఫిఫ్టీ...
ఓవర్‌నైట్‌ స్కోరు 125/4 శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన భారత్‌ రెండు ఓవర్లు ఆడిందో లేదో వర్షం తరుముకొచ్చింది. మళ్లీ ఆట మొదలవగా... ఓపెనర్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నాడు. టెస్టుల్లో వన్డే ఇన్నింగ్స్‌ ఆడిన ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ను రాబిన్సన్‌ ఔట్‌ చేశాడు.

జడేజా క్రీజులోకి రాగా 191/5 స్కోరు వద్ద భారత్‌ లంచ్‌కు వెళ్లింది. అనంతరం ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత సెంచరీ చేస్తాడనుకున్న రాహుల్‌ నిష్క్రమించాడు. ఈ దశలో జడేజా చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. అర్ధసెంచరీ పూర్తయ్యాక జడేజా కూడా వికెట్‌ను పారేసుకోగా... టెయిలెండర్లలో బుమ్రా (34 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కుదురుగా ఆడాడు. దీంతో భారత్‌కు చెప్పుకోదగ్గ ఆధిక్యం లభించింది.

కుంబ్లేను అధిగమించిన అండర్సన్‌
ఇంగ్లండ్‌ సీనియర్‌ సీమర్‌ జేమ్స్‌ అండర్సన్‌ భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే వికెట్ల మైలురాయి (619)ని అధిగమించాడు. గురువారం కోహ్లి (0)ని ఔట్‌ చేయడం ద్వారా 619 వికెట్లతో కుంబ్లే సరసన నిలిచిన ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ శుక్రవారం ఓపెనర్‌ కె.ఎల్‌.రాహుల్‌ (84) వికెట్‌తో కుంబ్లేను దాటేశాడు. ఇప్పుడు టెస్టుల్లో మురళీధరన్‌ (శ్రీలంక; 800), షేన్‌వార్న్‌ (ఆసీస్‌; 708), తర్వాత స్థానం అండర్సన్‌దే. అతని ఖాతాలో 621 వికెట్లున్నాయి.  కుంబ్లే (619) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ టాప్‌–4 అండర్సన్‌ మినహా ముగ్గురు ఎప్పుడో రిటైరయ్యారు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 183; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) స్యామ్‌ కరన్‌ (బి) రాబిన్సన్‌ 36; రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 84; పుజారా (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 4; కోహ్లి (సి) బట్లర్‌ (బి) అండర్సన్‌ 0; రహానే (రనౌట్‌) 5; పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) రాబిన్సన్‌ 25; జడేజా (సి) బ్రాడ్‌ (బి) రాబిన్సన్‌ 56; శార్దుల్‌ (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 0; షమీ (బి) రాబిన్సన్‌ 13; బుమ్రా (సి) బ్రాడ్‌ (బి) రాబిన్సన్‌ 28; సిరాజ్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (84.5 ఓవర్లలో ఆలౌట్‌) 278.  
వికెట్ల పతనం: 1–97, 2–104, 3–104, 4–112, 5–145, 6–205, 7–205, 8–232, 9–245, 10–278.
బౌలింగ్‌: అండర్సన్‌ 23–8–54–4, బ్రాడ్‌ 20–3–70–0, రాబిన్సన్‌ 26.5–6–85–5, స్యామ్‌ కరన్‌  15–2–57–0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (బ్యాటింగ్‌) 11; సిబ్లీ (బ్యాటింగ్‌) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (11.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 25.
బౌలింగ్‌: బుమ్రా 3–0–6–0, సిరాజ్‌ 5.1–2–10–0, షమీ 3–1–9–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement