IPL 2023, CSK Vs RR: ధోని మెరుపులు వృధా.. సీఎస్‌కేపై రాజస్తాన్‌ విజయం | Rajasthan Royals Beat Chennai Super Kings By 3 Runs - Sakshi
Sakshi News home page

IPL 2023: ధోని మెరుపులు వృధా.. సీఎస్‌కేపై రాజస్తాన్‌ విజయం

Published Thu, Apr 13 2023 3:11 AM | Last Updated on Thu, Apr 13 2023 8:43 AM

Rajasthan Royals beat Chennai Super Kings by 3 runs - Sakshi

చెన్నై: వరుసగా మూడో విజయం సాధించి ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేయాలని ఆశించిన నాలుగుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు నిరాశ ఎదురైంది. మాజీ విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ సమష్టి ప్రదర్శనతో చెన్నై జట్టుకు వారి సొంత మైదానంలోనే షాక్‌ ఇచ్చిం ది. 2008 తర్వాత చెన్నై వేదికలో చెన్నై జట్టును రాజస్తాన్‌ ఓడించడం ఇదే తొలిసారి. టాస్‌ గెలిచి చెన్నై జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీ త 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు సాధించింది.

జోస్‌ బట్లర్‌ (36 బంతుల్లో 52; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... దేవదత్‌ పడిక్కల్‌ (26 బంతుల్లో 38; 5 ఫోర్లు), అశ్విన్‌ (22 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (18 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆకాశ్‌ సింగ్, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా రెండు వికెట్ల చొప్పున తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీ త 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓడిపోయింది. డెవాన్‌ కాన్వే (38 బంతుల్లో 50; 6 ఫోర్లు), అజింక్య రహానే (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలకదశలో అవుటవ్వగా... చివర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ధోని (17 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించి ఆరో వికెట్‌కు ఐదు ఓవర్లలో 59 పరుగులు జోడించినా చెన్నైను విజయతీరానికి చేర్చలేకపోయారు.

డెవాన్‌ కాన్వే అవుటయ్యే సమయానికి చెన్నై స్కోరు 15 ఓవర్లలో 113/6. చెన్నై గెలవాలంటే 30 బంతుల్లో 63 పరుగులు చేయాలి. క్రీజులో జడేజా, ధోని ఉన్నారు. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో 4 పరుగులు... చహల్‌ వేసిన 17వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. దాంతో చెన్నై విజయసమీకరణం 18 బంతుల్లో 54 పరుగులుగా మారింది. జంపా వేసిన 18వ ఓవర్లో ధోని, జడేజా 14 పరుగులు... హోల్డర్‌ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రాబట్టారు. దాంతో చెన్నై నెగ్గడానికి చివరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి.

చివరి ఓవర్‌ వేసేందుకు వచ్చిన సందీప్‌ శర్మ తొలి రెండు బంతులను వైడ్‌ వేశాడు. ఆ తర్వాతి బంతికి పరుగు ఇవ్వని సందీప్‌... తర్వాతి రెండు బంతులు ఫుల్‌టాస్‌ వేయడంతో వాటిని ధోని సిక్స్‌లుగా మలిచాడు. దాంతో చెన్నై గెలవడానికి 3 బంతుల్లో 7 పరుగులు చేయాలి. అయితే సందీప్‌ శర్మ వేసిన మూడు బంతుల్లో ధోని, జడేజా మూడు పరుగులే చేయడంతో చెన్నై ఓటమి పాలైంది. రాజస్తాన్‌ స్పిన్నర్లు అశ్విన్‌ (2/25), యజువేంద్ర చహల్‌ (2/27) కీలక వికెట్లు తీసి చెన్నైను కట్టడి చేశారు.  


నిలబడి...తడబడి...: అంతకుముందు రాజస్తాన్‌ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. తుషార్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో యశస్వి జైస్వాల్‌ (8 బంతుల్లో 10; 2 ఫోర్లు) భారీ షాట్‌కు ప్రయత్నించి మిడ్‌ ఆఫ్‌ వద్ద శివమ్‌ దూబే చేతికి చిక్కాడు. అనంతరం బట్లర్, దేవ్‌దత్‌ ఇన్నింగ్స్‌ను నిరి్మంచారు. స్పిన్నర్‌ తీక్షణ బౌలింగ్‌లో వీరిద్దరు దూకుడుగా ఆడారు. తీక్షణ వేసిన తొలి ఓవర్లో 10 పరుగులు... రెండో ఓవర్లో 17 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత తుషార్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లోని తొలి రెండు బంతులను దేవ్‌దత్‌ బౌండరీకి తరలించాడు.

పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్తాన్‌ 57/1తో నిలిచింది. పవర్‌ప్లే తర్వాత కూడా బట్లర్, దేవదత్‌ ధాటిగానే ఆడారు. మొయిన్‌ అలీ వేసిన ఎనిమిదో ఓవర్లో బట్లర్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడంతో ఈ ఓవర్లో రాజస్తాన్‌ మొత్తం 18 పరుగులు సాధించింది. సాఫీగా సాగుతున్న రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో తడబడింది. రవీంద్ర జడేజా మూడు బంతుల వ్యవధిలో దేవదత్‌ను, కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (0)ను పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం నాలుగు ఓవర్లపాటు రాజస్తాన్‌ బ్యాటర్లు బట్లర్, అశ్విన్‌ ఆచితూచి ఆడారు. వీరిద్దరు ఈ నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కొట్టలేకపోయారు. ఆకాశ్‌ సింగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో అశ్విన్‌ రెండు వరుస సిక్స్‌లు కొట్టాడు.

అయితే ఇదే ఓవర్‌ చివరి బంతికి అశ్విన్‌ను ఆకాశ్‌ అవుట్‌ చేశాడు. దాంతో బట్లర్, అశ్విన్‌ 47 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ 135/4తో నిలిచింది. చివరి ఐదు ఓవర్లలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ప్రమాదకరంగా మారిన బట్లర్‌తోపాటు ధ్రువ్, హోల్డర్‌లను వెంటవెంటనే అవుట్‌ చేశారు. చివరి ఐదు ఓవర్లలో చెన్నై కేవలం 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. 

స్కోరు వివరాలు 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) శివమ్‌ దూబే (బి) తుషార్‌ దేశ్‌పాండే 10; బట్లర్‌ (బి) మొయిన్‌ అలీ 52; దేవదత్‌ పడిక్కల్‌ (సి) కాన్వే (బి) జడేజా 38; సంజూ సామ్సన్‌ (బి) జడేజా 0; అశ్విన్‌ (సి) మగాలా (బి) ఆకాశ్‌ సింగ్‌ 30; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 30; ధ్రువ్‌ జురేల్‌ (సి) శివమ్‌ దూబే (బి) ఆకాశ్‌ సింగ్‌ 4; హోల్డర్‌ (సి) కాన్వే (బి) తుషార్‌ దేశ్‌పాండే 0; జంపా (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–11, 2–88, 3–88, 4–135, 5–142, 6–167, 7–174, 8–175. బౌలింగ్‌: ఆకాశ్‌ సింగ్‌4–0–40–2, తుషార్‌ దేశ్‌పాండే 4–0–37–2, తీక్షణ 4–0–42–0, రవీంద్ర జడేజా 4–0–21–2, మొయిన్‌ అలీ 2–0–21–1, సిసాంద మగాలా 2–0–14–0. 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ (సి) యశస్వి (బి) సందీప్‌ శర్మ 8; డెవాన్‌ కాన్వే (సి) యశస్వి (బి) చహల్‌ 50;, అజింక్య రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 31; శివమ్‌ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 8; మొయిన్‌ అలీ (సి) సందీప్‌ శర్మ (బి) జంపా 7;  రాయుడు (సి) హెట్‌మైర్‌ (బి) చహల్‌ 1; జడేజా (నాటౌట్‌) 25; ధోని (నాటౌట్‌) 32; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–10, 2–78, 3–92, 4–102, 5–103, 6–113. బౌలింగ్‌: సందీప్‌ శర్మ 3–0–30–1, కుల్దీప్‌ సేన్‌ 2–0–8–0, హోల్డర్‌ 3–0–37–0, ఆడమ్‌     జంపా 4–0–43–1, అశ్విన్‌ 4–0–25–2, యజువేంద్ర చహల్‌ 4–0–27–2.   

ఐపీఎల్‌లో నేడు 
పంజాబ్‌ VS గుజరాత్‌ (రాత్రి గం. 7:30 నుంచి) 
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement