రాయల్స్‌ రాజసం | Rajasthan Royals Beat Kolkata Knight Riders by Six Wickets | Sakshi
Sakshi News home page

రాయల్స్‌ రాజసం

Published Sun, Apr 25 2021 4:51 AM | Last Updated on Sun, Apr 25 2021 7:14 AM

Rajasthan Royals Beat Kolkata Knight Riders by Six Wickets - Sakshi

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాజస్తాన్‌ రాయల్స్‌ అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో మోరిస్‌ హడలెత్తించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగా... ఛేజింగ్‌లో సంజూ సామ్సన్, మిల్లర్‌ నడిపించడంతో రాయల్స్‌ సునాయాసంగా విజయతీరం చేరింది. నిరాశాజనక ప్రదర్శనతో మాజీ చాంపియన్‌ కోల్‌కతా నాలుగో పరాజయం చవిచూసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.   

ముంబై: రెండు వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌కు ఊరటనిచ్చే విజయం లభించింది. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరిసి తమ ఖాతాలో రెండో గెలుపును జమ చేసుకుంది. వాంఖెడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 6 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)పై నెగ్గింది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన కేకేఆర్‌ వరుసగా నాలుగో పరాభవాన్ని మూట గట్టుకొని ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది.

రాహుల్‌ త్రిపాఠి (26 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్‌ (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. క్రిస్‌ మోరిస్‌ (4/23) బంతితో విజృంభించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (41 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. మిల్లర్‌ (23 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.   

బ్యాటింగ్‌లో తడబాటు...
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. క్రీజులో ఉన్నంతసేపు తీవ్రంగా ఇబ్బంది పడ్డ శుబ్‌మన్‌ గిల్‌ (11) బట్లర్‌ అద్భుతమైన అండర్‌ ఆర్మ్‌త్రోకి రనౌటయ్యాడు. 5వ ఓవర్‌ నాలుగో బంతికి షార్ట్‌ ఎక్స్‌ట్రా కవర్‌లోకి ఆడిన గిల్‌... లేని పరుగు కోసం ప్రయత్నించగా అక్కడే ఉన్న బట్లర్‌ బంతిని అందుకొని నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లోని వికెట్లను నేరుగా గురిచూసి కొట్టాడు. దాంతో గిల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

క్రీజులోకి వచ్చిన రాహుల్‌ త్రిపాఠి ఎదుర్కొన్న తొలి బంతిని ఫోర్‌ బాదాడు. మరో ఎండ్‌లో ఉన్న నితీశ్‌ రాణా (22; 1 ఫోర్, 1 సిక్స్‌) ఉనాద్కట్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ కొట్టాడు. అయితే సకారియా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చిన రాణా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన సునీల్‌ నరైన్‌ (6) యశస్వి జైస్వాల్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 55/3గా ఉంది. ఫామ్‌లో లేని కేకేఆర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ (0)ను ఈ మ్యాచ్‌లో దురదృష్టం వెంటాడింది.

మోరిస్‌ వేసిన 11వ ఓవర్‌ తొలి బంతిని షార్ట్‌ ఫైన్‌లెగ్‌ మీదుగా సిక్సర్‌ బాదిన త్రిపాఠి... రెండో బంతిని స్ట్రయిట్‌ డ్రైవ్‌ ఆడాడు. అయితే ఆ బంతి కాస్తా నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న మోర్గాన్‌ బ్యాట్‌ను తాకి... మోరిస్‌ సమీపంలో పడింది. అయితే అప్పటికే క్రీజును వదిలి ముందుకు వెళ్లిన మోర్గాన్‌ వెనక్కి వచ్చేలోపు బంతిని అందుకున్న మోరిస్‌ వికెట్లను గిరాటేశాడు. దాంతో ఒక్క బంతి ఆడకుండానే మోర్గాన్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్, త్రిపాఠి కలిసి రాజస్తాన్‌ బౌలర్లను ప్రతిఘటించారు. అయితే ముస్తఫిజుర్‌ తన స్లో ఆఫ్‌కట్టర్‌ డెలివరీతో త్రిపాఠిని బోల్తా కొట్టించాడు. క్రీజులోకి వచ్చిన రసెల్‌ సిక్సర్‌ బాది చెన్నైతో జరిగిన మ్యాచ్‌కు కొనసాగింపు అన్నట్లు కనపించాడు. అయితే బంతిని అందుకున్న మోరిస్‌... రసెల్‌ (9)తో పాటు మరో ఎండ్‌లో ఉన్న దినే శ్‌ కార్తీక్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. మళ్లీ చివరి ఓవర్‌ వేయడానికి వచ్చిన మోరిస్‌... ఆ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే ఇచ్చి  కమిన్స్‌ (10), శివమ్‌ మావి (5)లను అవుట్‌ చేసి కేకేఆర్‌ను కట్టడి చేశాడు.  

నడిపించిన నాయకుడు
ఛేదనలో రాజస్తాన్‌ను కెప్టెన్‌ సామ్సన్‌ విజయం వరకు నడిపించాడు. బట్లర్‌ (5) వికెట్‌ను త్వరగా కోల్పోగా... వన్‌డౌన్‌లో వచ్చిన సామ్సన్‌ బౌండరీతో ఖాతా తెరిచాడు. మరో ఎండ్‌లో యశస్వి జైస్వాల్‌ (22; 5 ఫోర్లు) దూకుడుగా  ఆడి శివమ్‌ మావి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. లక్ష్యం చిన్నదే అయినా వెంటవెంటనే వికెట్లను కోల్పోవడంతో రాజస్తాన్‌కు ఒక భాగస్వామ్యం అవసరమైంది. దాంతో ఆ బాధ్యతను కెప్టెన్‌ సామ్సన్, దూబే తీసుకున్నారు. నరైన్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా దూబే సిక్సర్‌ కొట్టడంతో... పవర్‌ప్లేలో రాజస్తాన్‌ రెండు వికెట్లకు 50 పరుగులు చేసింది. సామ్సన్, దూబే బౌండరీలతోపాటు సింగిల్స్‌కూ ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా రాజస్తాన్‌ స్కోరు బోర్డు ఎక్కడా నెమ్మదించలేదు.

10 ఓవర్లకు రాజస్తాన్‌ 80/2గా నిలిచింది. ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన వరుణ్‌ కేకేఆర్‌కు బ్రేక్‌ను అందించాడు. వరుణ్‌ వేసిన గూగ్లీ బంతిని దూబే షాట్‌ ప్రయత్నం చేయగా... బంతి బ్యాట్‌ అంచును తాకుతూ గాల్లోకి లేవగా షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌ దగ్గర ఉన్న ప్రసిధ్‌ కృష్ణ క్యాచ్‌ పట్టాడు. దాంతో 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తెవాటియా (5) విఫలమయ్యాడు. ఈ దశలో సామ్స న్‌తో జత కలిసిన మిల్లర్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు. మావి, ప్రసిధ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడంతో రాజస్తాన్‌ విజయ సమీ కరణం 30 బంతుల్లో 30 పరుగులకు వచ్చింది. మిల్లర్‌ వరుస ఓవర్లలో మూడు బౌండరీలు బాదడంతో రాజస్తాన్‌ను విజయం వరించింది.  

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: నితీశ్‌ రాణా (సి) సామ్సన్‌ (బి) సకారియా 22; గిల్‌ (రనౌట్‌) 11; రాహుల్‌ త్రిపాఠి (సి) పరాగ్‌ (బి) ముస్తఫిజుర్‌ 36; సునీల్‌ నరైన్‌ (సి) యశస్వి జైస్వాల్‌ (బి) ఉనాద్కట్‌ 6; మోర్గాన్‌ (రనౌట్‌) 0; దినేశ్‌ కార్తీక్‌ (సి) సకారియా (బి) మోరిస్‌ 25; రసెల్‌ (సి) మిల్లర్‌ (బి) మోరిస్‌ 9; కమిన్స్‌ (సి) పరాగ్‌ (బి) మోరిస్‌ 10; శివమ్‌ మావి (బి) మోరిస్‌ 5; ప్రసిధ్‌ కృష్ణ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 133.
వికెట్ల పతనం: 1–24, 2–45, 3–54, 4–61, 5–94, 6–117, 7–118, 8–133, 9–133.
బౌలింగ్‌: జైదేవ్‌ ఉనాద్కట్‌ 4–0–25–1, చేతన్‌ సకారియా 4–0–31–1, ముస్తఫిజుర్‌ 4–0–22–1, క్రిస్‌ మోరిస్‌ 4–0–23–4, రాహుల్‌ తెవాటియా 3–0–24–0, శివమ్‌ దూబే 1–0–5–0.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్‌ చక్రవర్తి 5; యశస్వి జైస్వాల్‌ (సబ్‌) (సి) కమలేశ్‌ నాగర్‌కోటి (బి) శివమ్‌ మావి 22; సంజూ సామ్సన్‌ (నాటౌట్‌) 42; శివమ్‌ దూబే (సి) ప్రసిధ్‌ కృష్ణ (బి) వరుణ్‌ చక్రవర్తి 22; తెవాటియా (సి) (సబ్‌) (సి) కమలేశ్‌ నాగర్‌కోటి (బి) ప్రసిధ్‌ కృష్ణ 5; మిల్లర్‌ (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 134.  
వికెట్ల పతనం: 1–21, 2–40, 3–85, 4–100.
బౌలింగ్‌: శివమ్‌ మావి 4–0–19–1, కమిన్స్‌ 3.5–0–36–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–32–2, నరైన్‌ 4–0–20–0, ప్రసిధ్‌ కృష్ణ, 3–0–20–1. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement