రాయల్స్‌ ముందుకు...చాలెంజర్స్‌ ఇంటికి... | Rajasthan win in eliminator | Sakshi
Sakshi News home page

రాయల్స్‌ ముందుకు...చాలెంజర్స్‌ ఇంటికి...

Published Thu, May 23 2024 3:11 AM | Last Updated on Thu, May 23 2024 8:58 AM

Rajasthan win in eliminator

ఎలిమినేటర్‌లో రాజస్తాన్‌ విజయం

4 వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు

రేపు రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో రాజస్తాన్‌ ‘ఢీ’   

అసాధారణ రీతిలో ఆరు వరుస విజయాలతో ‘ప్లే ఆఫ్స్‌’ వరకు దూసుకొచ్చిన బెంగళూరు ప్రస్థానం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముగిసింది. ‘కప్‌ నమ్‌దే’ అంటూ కొత్త ఆశలు రేపిన టీమ్‌ నాకౌట్‌ సమరంలో కుప్పకూలి మరోసారి అభిమానులను నిరాశకు గురి చేసింది. 

వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఎట్టకేలకు అసలు పోరులో తమ స్థాయిని ప్రదర్శించిన రాజస్తాన్‌ రాయల్స్‌ మరో అడుగు ముందుకేసి రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌తో సమరానికి సిద్ధమైంది. ముందుగా పదునైన బౌలింగ్‌తో  బెంగళూరును కట్టిపడేసిన రాజస్తాన్‌ ఆ తర్వాత సాధారణ లక్ష్యాన్ని ఆరు బంతుల ముందే అందుకుంది. 

అక్కడక్కడా కాస్త తడబాటు కనిపించినా...ఆఖరికి గెలుపు తీరం చేరింది. 700కుపైగా పరుగులు చేసిన తర్వాత కూడా ఇక్కడే ఆగిపోయిన విరాట్‌ కోహ్లి చిత్రం చూస్తే చాలు ఆర్‌సీబీ దురదృష్టం ఎలాంటిదో చెప్పేందుకు!   

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. బుధవారం జరిగిన ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 4 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 

రజత్‌ పటిదార్‌ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మహిపాల్‌ లోమ్రోర్‌ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం రాజస్తాన్‌ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు సాధించి గెలిచింది. యశస్వి జైస్వాల్‌ (30 బంతుల్లో 45; 8 ఫోర్లు), రియాన్‌ పరాగ్‌ (26 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కీలకమైన రెండు వికెట్లు తీసిన అశ్విన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

దూకుడు లేకుండా... 
బెంగళూరు ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి తడబడుతూనే సాగింది. కోహ్లి, డుప్లెసిస్‌ ఆశించిన మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. బౌల్ట్‌ తన 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టిపడేశాడు. 

డుప్లెసిస్, కోహ్లి తక్కువ వ్యవధిలో వెనుదిరిగిన తర్వాత కామెరాన్‌ గ్రీన్‌ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించాడు. అయితే గ్రీన్, మ్యాక్స్‌వెల్‌ (0)లను వరుస బంతులకు అవుట్‌ చేసి అశ్విన్‌ దెబ్బ కొట్టాడు. ఈ దశలో పటిదార్‌ ఇన్నింగ్స్‌ ఆర్‌సీబీని ముందుకు నడిపించింది. 

5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జురేల్‌ సునాయాస క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన పటిదార్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. చహల్‌ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. తన చివరి ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో దినేశ్‌ కార్తీక్‌ (11) విఫలం కాగా, చివర్లో లోమ్రోర్‌ ధాటిగా ఆడాడు. 

రాణించిన జైస్వాల్‌... 
ఛేదనను జైస్వాల్, టామ్‌ కోలర్‌ (20) జాగ్రత్తగా మొదలు పెడుతూ తొలి 2 ఓవర్లలో 6 పరుగులే చేశారు. అయితే యశ్‌ దయాళ్‌ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్‌ 4 ఫోర్లు బాది జోరు మొదలు పెట్టగా, సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్లో కూడా 3 ఫోర్లు వచ్చాయి. కోలర్‌ వెనుదిరిగిన తర్వాత జైస్వాల్, స్యామ్సన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు.

అయితే వీరిద్దరు ఐదు పరుగుల వ్యవధిలో వెనుదిరగడం, జురేల్‌ (8) రనౌట్‌ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో ఎండ్‌లో పరాగ్‌ ఆకట్టుకునే ఆటతో గెలుపు భారాన్ని తీసుకున్నాడు. 

పరాగ్, హెట్‌మైర్‌ (14 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మధ్య 45 పరుగుల భాగస్వామ్యం (25 బంతుల్లో) రాజస్తాన్‌ను విజయం దిశగా తీసుకెళ్లింది. విజయానికి చేరువైన దశలో వీరిద్దరు నిష్క్రమించినా రావ్‌మన్‌ పావెల్‌ (8 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పని పూర్తి చేశాడు.  

స్కోరు వివరాలు  
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) (సబ్‌) ఫెరీరా (బి) చహల్‌ 33; డుప్లెసిస్‌ (సి) పావెల్‌ (బి) బౌల్ట్‌ 17; గ్రీన్‌ (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 27; పటిదార్‌ (సి) పరాగ్‌ (బి) అవేశ్‌ 34; మ్యాక్స్‌వెల్‌ (సి) జురేల్‌ (బి) అశ్విన్‌ 0; లోమ్రోర్‌ (సి) పావెల్‌ (బి) అశ్విన్‌ 32; కార్తీక్‌ (సి) జైస్వాల్‌ (బి) అవేశ్‌ 11; స్వప్నిల్‌ (నాటౌట్‌) 9; కరణ్‌ (సి) పావెల్‌ (బి) సందీప్‌ 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–37, 2–56, 3–97, 4–97, 5–122, 6–154, 7–159, 8–172. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–16–1, సందీప్‌ శర్మ 4–0–48–1, అవేశ్‌ ఖాన్‌ 4–0–44–3, అశ్విన్‌ 4–0–19–2, చహల్‌ 4–0–43–1.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) కార్తీక్‌ (బి) గ్రీన్‌ 45; టామ్‌ కోలర్‌ (బి) ఫెర్గూసన్‌ 20; సామ్సన్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) కరణ్‌ 17; పరాగ్‌ (సి) సిరాజ్‌ 36; జురేల్‌ (రనౌట్‌) 8; హెట్‌మైర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) సిరాజ్‌ 26; పావెల్‌ (నాటౌట్‌) 16; అశ్విన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–46, 2–81, 3–86, 4–112, 5–157, 6–160. బౌలింగ్‌: స్వప్నిల్‌ 2–0–19–0, సిరాజ్‌ 4–0–33–2, దయాళ్‌ 3–0–37–0, ఫెర్గూసన్‌ 4–0–37–1, కరణ్‌ శర్మ 2–0–19–1, గ్రీన్‌ 4–0–28–1. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement