ముంబై కెప్టెన్ పృథ్వీ షా, మధ్యప్రదేశ్ సారథి ఆదిత్య
బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్ దిగ్గజ జట్టు ముంబై ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 46 సార్లు ఫైనల్ చేరిన ఆ టీమ్ ఐదుసార్లు మాత్రమే తుది పోరులో పరాజయం పాలైంది. మరోవైపు మధ్యప్రదేశ్ ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క రంజీ టైటిల్ కూడా లేదు. 23 ఏళ్ల క్రితం ఒకే ఒకసారి ఫైనల్ చేరిన ఆ టీమ్ ఓటమితో సరిపెట్టుకుంది.
ఇప్పుడు తమ అంకెను 42కు పెంచుకునేందుకు ముంబైకి, తొలి ట్రోఫీని ముద్దాడేందుకు మధ్యప్రదేశ్‌కు అవకాశం వచ్చింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రాబోయే ఐదు రోజుల పాటు ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలుస్తుందనేది ఆసక్తికరం. బలాబలాలను బట్టి చూస్తే ముంబైది పైచేయిగా కనిపిస్తున్నా... ఈ సీజన్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన మధ్యప్రదేశ్ అంత సులువుగా ఓటమిని అంగీకరించకపోవచ్చు.
ఫామ్‌లో బ్యాటర్లు...
7 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో ఏకంగా 803 పరుగులు... ఈ సీజన్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఫామ్ ఇది. యశస్వి జైస్వాల్ (419) కూడా సత్తా చాటగా, అర్మాన్ జాఫర్, సువేద్ పార్కర్ కూడా కీలక పరుగులతో ముంబైని నడిపించారు.
రజత్ పటిదార్ కీలకం...
ఆదిత్య శ్రీవాస్తవ కెప్టెన్సీలోని మధ్యప్రదేశ్ జట్టులో స్టార్స్ లేకపోయినా సమష్టి తత్వమే టీమ్‌ను ఫైనల్ వరకు చేర్చింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన రజత్ పటిదార్ (506 పరుగులు) దేశవాళీ టీమ్ తరఫున కూడా టాప్ స్కోరర్‌గా బ్యాటింగ్ భారం మోస్తున్నాడు. యశ్ దూబే (480), శుభమ్ శర్మ (462), హిమాన్షు (307) కీలక ఆటగాళ్లు. వీరిలో ఏ ఇద్దరు రాణించినా మధ్యప్రదేశ్ మెరుగైన స్థితికి చేరగలదు. ఐపీఎల్‌లో ముంబై తరఫున ఆకట్టుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ (27 వికెట్లు) బౌలింగ్‌లో మరోసారి ముందుండి నడిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment