Ranji Trophy 2023-24- Hyderabad Vs Nagaland: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ను హైదరాబాద్ ఘన విజయంతో ఆరంభించింది. నాగాలాండ్‌ను ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో మట్టికరిపించి జయభేరి మోగించింది. కాగా ఈసారి రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ‘ప్లేట్’ డివిజన్‌లో పోటీపడుతోంది . ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు.
తొలిరోజే పరుగుల వరద.. రాహుల్ డబుల్ ధమాకా
ఈ క్రమంలో దీమాపూర్ వేదికగా నాగాలాండ్ జట్టుతో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. తొలిరోజే పరుగుల వరద పారించింది. ఆతిథ్య నాగాలాండ్ బౌలర్ల భరతం పట్టిన హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ సింగ్ గహ్లోత్ ద్విశతకం(214)తో అదరగొట్టాడు.
తిలక్ వర్మ అజేయ సెంచరీ
తిలక్ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) నమోదు చేయగా... తన్మయ్ అగర్వాల్ (80; 12 ఫోర్లు) కూడా రాణించాడు. ఈ క్రమంలో 76.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 474 పరుగుల వద్ద హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆట ముగిసే సమయానికి నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు సాధించింది. ఇక 35/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన నాగాలాండ్ 51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ ఫాలో ఆన్ ఆడించింది.
చిత్తుగా ఓడిన నాగాలాండ్
అయితే, ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే చేతులెత్తేశారు నాగాలాండ్ బ్యాటర్లు. దీంతో ఇన్నింగ్స్ మీద 194 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్ ముగిసిపోయింది.
ఇక నాగాలాండ్‌తో మ్యాచ్‌లో తిలక్ వర్మ సేనలోని బౌలర్లలో టి.త్యాగరాజన్ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్‌కు ఆరు వికెట్లు దక్కాయి. మిగతా వాళ్లలో తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్ రాయుడు ఒక వికెట్ పడగొట్టారు.
కాగా తిలక్ కెప్టెన్సీలో హైదరాబాద్ వరుస విజయాలు సాధించాలని.. బ్యాటర్‌గానూ రాణించి అతడు టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయాలని ఈ సందర్భంగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, వన్డేలలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
చరిత్ర సృష్టించిన రాహుల్ సింగ్
గతంలో సర్వీసెస్ జట్టుకు ఆడిన రాహుల్ సింగ్ గహ్లోత్ 157 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్‌లతో 214 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈసారి హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 143 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్ గుర్తింపు పొందాడు.
చదవండి: BCCI: ఇంగ్లండ్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే
Comments
Please login to add a commentAdd a comment