రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ రికీ భుయ్ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు శతకాలు చేసిన భుయ్.. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో సెంచరీతో (సెకెండ్ ఇన్నింగ్స్) మెరిశాడు.
ఈ మ్యాచ్‌లో భుయ్ సెంచరీతో కదంతొక్కడంతో ఆంధ్ర జట్టు పటిష్ట స్థితికి చేరింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్ 271/5గా ఉంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ఆంధ్ర జట్టు 334 పరుగుల లీడ్‌లో ఉంది. భుయ్‌కు (100) జతగా షేక్ రషీద్ (42) క్రీజ్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో భుయ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టాడు. ఆరు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. ఈ సీజన్‌లో భుయ్ ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో 93 సగటున నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీల సాయంతో 744 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు.
ప్రస్తుత రంజీ సీజన్‌లో భుయ్ చేసిన సెంచరీలు..
- బెంగాల్‌పై 175
- ఆసోంపై 125
- చత్తీస్‌ఘడ్‌పై 120
- ఉత్తర్‌ప్రదేశ్‌పై 100 నాటౌట్
మ్యాచ్ విషయానికివస్తే.. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైంది. భుయ్ (94), శశికాంత్ (72) అర్ద సెంచరీలతో రాణించారు. యూపీ బౌలర్లలో యశ్ దయాల్, రాజ్‌పుత్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆకిబ్ ఖాన్, సౌరభ్ కుమార్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూపీ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. యూపీ ఇన్నింగ్స్‌లో ఆర్యన్ జురెల్ (60) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శశికాంత్ ఐదు వికెట్లతో చెలరేగాడు. 63 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలపుకుని ఆంధ్ర 334 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment