రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో మహారాష్ట్ర కెప్టెన్, టీమిండియా బ్యాటర్ కేదార్ జాదవ్ రెచ్చిపోయాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 216 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేశాడు. 38 ఏళ్ల లేటు వయసులో కేదార్ బ్యాట్ నుంచి జాలు వారిన ఈ ఇన్నింగ్స్ అతని కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా మిగిలిపోనుంది.
కేదార్‌తో పాటు పవన్ షా (136), అంకిత్ బావ్నే (131) కూడా శతకాలతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 601 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మహా ఇన్నింగ్స్‌లో మూడు శతకాలతో పాటు ఓ హాఫ్ సెంచరీ కూడా నమోదైంది. షేక్ నౌషద్ 73 పరుగులు చేశాడు. జార్ఖండ్ బౌలర్లలో షాబాజ్ నదీమ్ 2, ఆశిష్ కుమార్, ఆరోన్, విరాట్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ కెప్టెన్ విరాట్ సింగ్ (108) సెంచరీతో కదంతొక్కడంతో 403 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్‌కు జతగా కుమార్ సూరజ్ (83) రాణించాడు. షాబాజ్ నదీం (41), కుషాగ్రా (36), డియోబ్రాట్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో హితేశ్ వాలుంజ్ 6 వికెట్లతో జార్ణండ్ పతనాన్ని శాశించగా.. ఆషయ్ పాల్కర్ 2, ప్రదీప్ దడే, రామకృష్ణ ఘోష్ తలో వికెట్ పడగొట్టారు.
నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. జార్ఖండ్.. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 132 పరుగులు వెనుకపడి ఉంది. క్రీజ్‌లో ఓపెనర్లు నజీమ్ సిద్దిఖీ (20), కుమార్ సూరజ్ (42) కుదురుకున్నట్లు కనిపిస్తున్నారు. ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment