
ముంబై: బ్యాటర్ల వైఫల్యంతో ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో తొలి ఓటమి దిశగా సాగుతోంది. ముంబైతో జరుగుతున్న గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు ఫాలోఆన్ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఆంధ్ర జట్టు మరో 45 పరుగులు సాధించాలి.
షేక్ రషీద్ (52 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (22 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 98/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 72 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. ప్రశాంత్ కుమార్ (73; 10 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై స్పిన్నర్ షమ్స్ ములానీ (6/65) ఆంధ్రను దెబ్బకొట్టాడు.
211 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా ఆంధ్ర జట్టుకు ఫాలోఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో ములానీ మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి అతను 3 వికెట్లు తీశాడు. మొత్తంగా ఇప్పటికే ములానీ తన ఖాతాలో 9 వికెట్లు వేసుకున్నాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటైంది. భుపేన్ లాల్వాని (61), తనుశ్ కోటియన్ (54), మోహిత్ అవస్థి (53) అర్ధసెంచరీలతో రాణించారు. ఆంధ్ర పేసర్ నితీశ్ కుమార్ రెడ్డి ఐదు వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment