సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు లీగ్ దశను ‘డ్రా’తో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా కేరళతో జరిగిన చివరిదైన ఏడో లీగ్ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు పోరాడి ‘డ్రా’ చేసుకుంది. చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 19/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 97 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు సాధించి ‘డ్రా’తో గట్టెక్కింది. 242 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కేరళ జట్టుకు 3 పాయింట్లు, ఆంధ్ర జట్టుకు ఒక పాయింట్ లభించాయి.
అశ్విన్ హెబ్బర్ (165 బంతుల్లో 72; 12 ఫోర్లు, 1 సిక్స్) సంయమనంతో ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కరణ్ షిండే (82 బంతుల్లో 26; 5 ఫోర్లు), షేక్ రషీద్ (93 బంతుల్లో 36; 6 ఫోర్లు), షోయబ్ ఖాన్ (93 బంతుల్లో 11; 2 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి ఆంధ్ర జట్టుకు ఓటమి తప్పించడంలో కీలకపాత్ర పోషించారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌట్ కాగా... కేరళ తొలి ఇన్నింగ్స్‌ను 514/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment