కృనాల్‌ పాండ్యా సెంచరీ.. హ్యాట్రిక్‌ విజయాలు.. హార్దిక్‌ పోస్ట్‌ వైరల్‌ | Ranji trophy Hardik Pandya Lauds Baroda Captain Krunal For smashing Century | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన కృనాల్‌ పాండ్యా.. ‘మా అన్న’ అంటూ హార్దిక్‌ పోస్ట్‌ వైరల్‌

Published Mon, Oct 28 2024 7:51 PM | Last Updated on Mon, Oct 28 2024 8:15 PM

Ranji trophy Hardik Pandya Lauds Baroda Captain Krunal For smashing Century

రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో బరోడా జట్టు కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు హాఫ్‌ సెంచరీలు చేసిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. తాజాగా శతకంతో మెరిశాడు. ఒడిశాతో మ్యాచ్‌లో 143 బంతులు ఎదుర్కొని 119 పరుగులు సాధించాడు. కృనాల్‌ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

ఇక ఈ మ్యాచ్‌లో బరోడా ఒడిషాపై ఏకంగా ఇన్నింగ్స్‌ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన అన్న కృనాల్‌ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘మా అన్నయ్య.. ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టాప్‌ సెంచరీ.. నీ శ్రమకు తగ్గ ఫలితం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

కాగా రంజీ తాజా సీజన్‌లో కృనాల్‌ పాండ్యా సారథ్యంలోని బరోడా వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో ముంబైని 84 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో సర్వీసెస్‌ను 65 రన్స్‌ తేడాతో ఓడించింది. ఈ క్రమంలో వడోదర వేదికగా ఒడిశా జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన బరోడా తొలుత బౌలింగ్‌ చేసింది.

అయితే, బరోడా బౌలర్ల ధాటికి ఒడిశా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బరోడాకు ఓపెనర్‌ శైవిక్‌ శర్మ(96) శుభారంభం అందించగా.. మిడిలార్డర్‌లో విష్ణు సోలంకి(98) దుమ్ములేపాడు. ఇక వీరికి తోడుగా కృనాల్‌ పాండ్యా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఫలితంగా బరోడా మొదటి ఇన్నింగ్స్‌లో 456 పరుగులు చేసి.. 263 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.

అయితే, బరోడా బౌలర్లు మరోసారి చెలరేగడంతో ఒడిశా 165 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆటలోనే ఫలితం తేలింది. బరోడా ఒడిశాపై ఇన్నింగ్స్‌ 98 రన్స్‌ తేడాతో జయభేరి మోగించి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. కాగా హార్దిక్‌ పాండ్యా సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా పునరాగమనం చేయనున్నాడు.

చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్‌ టూర్‌కు ఎంపికైన పేసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement