రంజీ ట్రోఫీ 2024 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళ (ఫిబ్రవరి 23) మొదలయ్యాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో విదర్భ-కర్ణాటక.. రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై-బరోడా.. మూడో క్వార్టర్స్‌లో సౌరాష్ట్ర-తమిళనాడు.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్-ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి.
చెలరేగిన ఆంధ్ర బౌలర్లు..
మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో తొలి రోజు ఆంధ్ర బౌలర్ల హవా కొనసాగింది. ఆంధ్ర పేసర్లు ఎంపీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. శశికాంత్ (4/37), నితీశ్ రెడ్డి (3/50), గిరినాథ్ రెడ్డి (1/40) ధాటికి ఎంపీ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఎంపీ బ్యాటర్లలో యశ్ దూబే (64) అర్దసెంచరీతో రాణించగా.. హిమాన్షు మంత్రి (49), సరాన్ష్ జైన్ (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సరాన్ష్ జైన్‌కు జతగా కుల్వంత్ కేజ్రోలియా (1) క్రీజ్‌లో ఉన్నాడు.
సెంచరీతో కదంతొక్కిన అథర్వ తైడే..
కర్ణాటకతో జరుగుతున్న తొలి క్వార్టర్స్‌లో విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అథర్వ తైడే (109) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కరుణ్ నాయర్ (30), అక్షయ్ వాద్కర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో కావేరప్ప, కౌశిక్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు.
ముషీర్ ఖాన్ అద్భుత శతకం..
బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (128 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. అతనికి జతగా హార్దిక్ తామోర్ (30) క్రీజ్‌లో ఉన్నాడు. పృథ్వీ షా 33, ఆజింక్య రహానే 3 పరుగులు చేసి ఔటయ్యారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 4, నినాద్ రత్వ ఓ వికెట్ పడగొట్టారు.
ఐదేసిన సాయికిషోర్..
తమిళనాడుతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 183 పరుగులకే ఆలౌటైంది. సాయికిషోర్ (5/33) తన స్పిన్ మాయాజాలంతో సౌరాష్ట్ర పతనాన్ని శాశించాడు. అజిత్ రామ్ 3, సందీప్ వారియర్ 2 వికెట్లు పడగొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్వక్ దేశాయ్ (83) ఒక్కడే రాణించాడు. సీనియర్ బ్యాటర్ పుజారా (2) విఫలమయ్యాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. విమల్ కుమార్ (5) ఔట్ కాగా.. జగదీశన్ (12), సాయికిషోర్ (6) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment