బంతితో మెరిసిన శశికాంత్, నితీశ్‌ | Ranji Trophy Quarter Final which started on Friday | Sakshi
Sakshi News home page

బంతితో మెరిసిన శశికాంత్, నితీశ్‌

Published Sat, Feb 24 2024 2:08 AM | Last Updated on Sat, Feb 24 2024 2:08 AM

Ranji Trophy Quarter Final which started on Friday - Sakshi

ఇండోర్‌: భారీ స్కోరు దిశగా సాగుతోన్న మధ్యప్రదేశ్‌ జట్టును తమ మీడియం పేస్‌ బౌలింగ్‌తో ఆంధ్ర బౌలర్లు శశికాంత్‌ (4/37), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (3/50) కట్టడి చేశారు. శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మధ్యప్రదేశ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 234 పరుగులు సాధించింది.

పచ్చికతో కూడిన పిచ్‌పై ఓపెనర్లు యశ్‌ దూబే (133 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌), హిమాన్షు మంత్రి (97 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్‌ 37వ ఓవర్లో హిమాన్షును శశికాంత్‌ అవుట్‌ చేయడంతో మధ్యప్రదేశ్‌ ఇన్నింగ్స్‌ పతనం మొదలైంది. 36 పరుగుల తేడాలో మధ్యప్రదేశ్‌ 7 వికెట్లు కోల్పోయింది. దాంతో 123/0తో పటిష్టంగా కనిపించిన మధ్యప్రదేశ్‌ 159/7తో కష్టాల్లో పడింది.

ఈ దశలో సారాంశ్‌ జైన్‌ (108 బంతుల్లో 41 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కుమార్‌ కార్తికేయ (79 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 51 పరుగులు జోడించి మధ్యప్రదేశ్‌ స్కోరును 200 దాటించారు. కార్తికేయను అవుట్‌ చేసి శశికాంత్‌ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టగా... అవేశ్‌ ఖాన్‌ను గిరినాథ్‌ రెడ్డి రనౌట్‌ చేయడంతో మధ్యప్రదేశ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement