తమిళనాడు కవల సోదరులు(PC: ANI)
Ranji Trophy 2022 Tamil Nadu vs Chhattisgarh: రంజీ ట్రోఫీ-2022 టోర్నీలో భాగంగా సరికొత్త రికార్డు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు కవల సోదరులు బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్ చరిత్ర సృష్టించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరూ సెంచరీ సాధించి అరుదైన ఫీట్ నమోదు చేశారు. తద్వారా క్రికెట్ రికార్డు బుక్‌లో తమ పేరు లిఖించుకున్నారు. కాగా ఎలైట్ గ్రూపు హెచ్‌లో భాగంగా గువాహటి వేదికగా తమిళనాడు- ఛత్తీస్‌గఢ్ జట్లు తలపడుతున్నాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు జట్టుకు ఓపెనర్లు కౌశిక్ గాంధీ, లక్ష్మేష సూర్యప్రకాశ్ శుభారంభం అందించలేకపోయారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన బాబా అపరాజిత్ 267 బంతులు ఎదుర్కొని 166 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
ఇక నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన బాబా ఇంద్రజిత్ 141 బంతుల్లో 21 ఫోర్ల సాయంతో 127 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో అరుదైన రికార్డు వీరి సొంతమైంది. ఇక వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో తమిళనాడు రెండో రోజు ఆటలో పటిష్ట స్థితికి చేరుకుంది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయానికి 118 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 470 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment