టీ20 వరల్డ్‌కప్-2024లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. ఈ మెగా టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్రత్యర్ధి జట్లను భయపెట్టిన అఫ్గాన్ జట్టు.. నాకౌట్ దశను దాటలేకపోయింది.
ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో 9 వికెట్ల తేడాతో అఫ్గాన్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన అఫ్గానిస్తాన్ కేవలం 56 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం 57 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టగా.. అఫ్గానిస్తాన్ ఇంటి బాట పట్టింది. ఇక ఈ ఓటమిపై అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
"ఈ ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేము బాగా ఆడటానికి ప్రయత్నించాము. కానీ ఇక్కడి పిచ్ మాకు పెద్దగా సహకరించలేదు. ఇక్కడి పరిస్థితులు బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉన్నాయి. అయితే మా ఓటమికి ఇదే నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. ప్రస్తుత టీ20 క్రికెట్ అంటే ఎలా ఉంటుందంటే అన్ని పరిస్థితులకూ మనం సిద్ధంగా ఉండాలి.
సౌతాఫ్రికా బౌలర్లు కూడా అద్బుతంగా బౌలింగ్ చేశారు. సెమీస్‌లో ఓడిపోయినప్పటకి ఈ టోర్నీలో మేము గొప్ప విజయాలు సాధించాము. ముజీబ్ ఆరంభంలోనే మా జట్టుకు దూరమైనప్పటికి మా సీమర్లు అతడి లోటును తెలియజేయలేదు.
మా పేసర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. నబీ కూడా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీని మేం బాగా ఆస్వాదించాం. టాప్ క్లాస్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను.
కానీ ఇది మాకు ప్రారంభం మాత్రమే. ఏ జట్టునైనా ఓడించగలమన్న విశ్వాసం, నమ్మకం మాకు ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని"పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రషీద్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment