టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో టెస్టులో మరొక వికెట్ తీస్తే చాలు.. మరో ఎలైట్ జాబితాలోనూ చోటు దక్కించుకుంటాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన.. నజ్ముల్ షాంటో బృందాన్ని 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సమిష్టి ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.
తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో
ఇక ఈ మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జడేజా.. 86 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించి.. ఓ రేర్ ఫీట్ నమోదు చేశాడు. తన జట్టు టెస్టుల్లో గెలిచిన సందర్భాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించడంతో పాటు.. 200కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి.
టీమిండియా గెలిచిన సందర్భాల్లో ఇప్పటి వరకు జడ్డూ 2003 రన్స్ చేశాడు. అంతేకాదు 218 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ (1943 రన్స్, 369 వికెట్లు) జడ్డూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.
ఇంకొక్క వికెట్ తీస్తే..
కాన్పూర్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఒక వికెట్ తీస్తే.. టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. తద్వారా.. సంప్రదాయ క్రికెట్‌లో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలుస్తాడు. అంతేకాదు.. ఈ ఫీట్ నమోదు చేసిన టీమిండియా తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్‌గానూ రికార్డు సాధిస్తాడు.
టీ20లకు గుడ్‌బై
కాగా 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా.. ఇప్పటి వరకు 73 టెస్టులు, 197 వన్డేలు, 74 టీ20లు ఆడాడు. ఈ లెఫ్టాండర్ టెస్టులో 3122 పరుగులు, 299 వికెట్లు.. వన్డేల్లో 2756 రన్స్, 220 వికెట్లు, టీ20లలో 515 పరుగులు, 54 వికెట్లు తీశాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడిన భారత జట్టులో సభ్యుడైన 35 ఏళ్ల జడ్డూ.. ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో కలిసి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టులు, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.
చదవండి: IPL 2025: సీఎస్‌కేకు బై బై.. కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్
Comments
Please login to add a commentAdd a comment