
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మరో 5 రోజుల్లో (మార్చి 22) ప్రారంభం కానుంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది.
అన్ని సీజన్లకు ముందు లాగే ఈ సారి కూడా ఆర్సీబీ 'ఈ సాలా కప్ నమ్మదే' అన్న నినాదంతో బరిలోకి దిగుతుంది. 17 సీజన్లలో ఒక్క సారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ సారి ఓ అంశం ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసేలా సూచిస్తుంది.
ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్.. ఈ సారి ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య మ్యాచ్ అవుతున్నాయి. విరాట్ జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ యేడు ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య కూడా పద్దెనిమిదే. ఇలాగైనా విరాట్ లక్కీ నంబర్ 18 ఆర్సీబీకి టైటిల్ సాధించిపెడుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్‌లో కాస్త ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ (రజత్ పాటిదార్), కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది. మెగా వేలానికి ముందు విరాట్ (21 కోట్లు), రజత్ పాటిదార్ (11 కోట్లు), యశ్ దయాల్‌ను (5 కోట్లు) మాత్రమే అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, సిరాజ్ లాంటి స్టార్లను వదిలేసింది.
మెగా వేలంలో ఆర్సీబీకి 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం 22 మందితోనే సరిపెట్టుకుంది. వేలంలో ఆర్సీబీ ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లను.. హాజిల్‌వుడ్, ఎంగిడి లాంటి స్టార్ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది. దేశీయ స్టార్లు జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యాపై కూడా ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నమ్మకముంచింది.
ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే.. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ధృవీకరించాడు. వన్‌డౌన్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్.. నాలుగో స్థానంలో లివింగ్‌స్టోన్, ఐదో స్థానంలో జితేశ్ శర్మ, ఆరో ప్లేస్‌లో టిమ్ డేవిడ్, ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా, బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.
ఆర్సీబీ మొత్తం జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లియామ్ లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ భాండగే, జాకబ్ బెథెల్, జోష్ హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం దార్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, లుంగి ఇన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రతీ, యశ్ దయాల్.
Comments
Please login to add a commentAdd a comment