సాఫ్ట్ సిగ్నల్‌పై వివాదానికి దారి తీసిన క్యాచ్ అవుట్!
Soft- Signal Rule: క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ‘సాఫ్ట్ సిగ్నల్’ నిబంధనను రద్దు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ సందర్భంగా ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి తన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ నుంచి ఈ రూల్ కనుమరుగు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తప్పనిసరిగా చెప్పాల్సిందే!
అవుట్(క్యాచ్) లేదా నాటౌట్ విషయంలో సందేహం తలెత్తినపుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించే ముందు తమ విచక్షణకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు వెసలుబాటు కల్పించే నిబంధనే సాఫ్ట్ సిగ్నల్. క్రికెట్ నిబంధనలు రూపొందించే ‘ఎంసీసీ’ ప్రకారం అంపైర్ అవుట్ కానీ నాటౌట్ కానీ ఏదో ఒక నిర్ణయాన్ని అన్ ఫీల్డ్ అంపైర్ తనవైపు నుంచి తప్పనిసరిగా ప్రకటించాల్సిందే.
మరీ సాంకేతికతపైనే ఆధారపడకుండా
టెక్నాలజీ ఎంత పెరిగినా దానిని ఆపరేట్ చేసేది మనుషులే కాబట్టి పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడకుండా అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలనేది ‘సాఫ్ట్ సిగ్నల్’ అంతస్సూత్రం. ఎల్బీడబ్ల్యూల విషయంలో ‘అంపైర్స్ కాల్’ను అమలు చేస్తోంది కూడా ఇందుకే!
బౌలర్ ఎండ్ నుంచి ఆన్ ఫీల్డ్ అంపైర్.. ఒక బ్యాటర్ అవుటయ్యాడా లేదంటే నాటౌటా అన్న విషయాన్ని తన కళ్లతో పరీక్షించిన తర్వాత.. ఒకవేళ సందేహం ఉంటే.. తన నిర్ణయాన్ని చెప్పడంతో పాటుగా థర్డ్ అంపైర్ సహాయాన్ని కూడా కోరతాడు.
క్లియర్‌గా కనిపించినా
ఒకవేళ థర్డ్ అంపైర్ రీప్లేలో ఈ అంశాలను గమనించిన తర్వాత ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఆధారాలు గనుక లభించనట్లయితే.. అతడి నిర్ణయాన్నే ఫైనల్ చేస్తాడు. రీప్లేల్లోనూ స్పష్టంగా కనిపించని ‘ఇన్‌కన్‌క్లూజివ్’ విషయాల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్ డెసిషన్‌కే కట్టుబడి ఉంటారు. అయితే, ఒక్కోసారి రీప్లేలో క్లియర్‌గా కనిపించినా ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకారమే నడుచుకోవడం వివాదాలకు దారితీసింది.
నాటి మ్యాచ్‌లో సూర్య ఇచ్చిన క్యాచ్ విషయంలో వివాదం
ముఖ్యంగా 2021లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 సందర్భంగా చోటుచేసుకున్న ఘటన సాఫ్ట్ సిగ్నల్‌పై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ మ్యాచ్‌లో సామ్ కరన్ బౌలింగ్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను డేవిడ్ మలన్ క్యాచ్ పట్టాడు.
అయితే, ఆ సమయంలో బంతి గ్రౌండ్‌ను తాకినట్లు కనిపించింది. కానీ అప్పటికే సూర్య అవుటైనట్లు అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ సాయం కోరాడు. రీప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కే ఓటేశాడు. దీంతో వివాదం ముదిరింది.
ఇలాంటి రూల్‌ను రద్దు చేయాల్సిందే!
దీంతో కనిపించనంత దూరంలో బౌండరీ వద్ద పట్టిన సందేహాస్పద క్యాచ్‌పై కూడా ఆన్ ఫీల్డ్ అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ పేరుతో తన నిర్ణయం ప్రకటించడం, సాంకేతికత అందుబాటులో ఉన్నా తప్పుడు నిర్ణయాలు వెలువడటంతో ఈ నిబంధన ఎత్తేయాలంటూ డిమాండ్లు వినిపించాయి.
అదే విధంగా.. తనకు అర్థంకాని అంశంలో ఫీల్డ్ అంపైర్ అసలు స్పందించాల్సిన అవసరం ఏమిటి? రనౌట్ల విషయంలో మాదిరే నేరుగా థర్డ్ అంపైర్‌కే వదిలేయొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ నుంచి ఈ నిబంధనను రద్దు చేయాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మేరకు సౌరవ్ గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా జూన్ 7-11 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది.
చదవండి: కేకేఆర్‌కు ఊహించని షాక్! ఇంపాక్ట్ ప్లేయర్ సహా వాళ్లందరికీ!
వాళ్ల తప్పేం లేదు..! అతడు అద్భుతం.. జట్టుకు దొరికిన విలువైన ఆస్తి: ధోని
Comments
Please login to add a commentAdd a comment