![Reports: Gunfire Near-England Cricket Team Hotel Multan Ahead 2nd Test - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/8/multan.jpg.webp?itok=QyN9QZNL)
17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకున్న ఇంగ్లండ్ సిరీస్‌పై కన్నేసింది. శుక్రవారం ముల్తాన్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే పాక్ మాత్రం ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే ముల్తాన్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్‌కు సమీపంలో కాల్పలు కలకలం రేపాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్న హోటల్‌కు కిలోమీటర్ దూరంలో గురువారం ఉదయం తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. స్థానిక ముఠాల మధ్య జరిగిన గొడవలో తుపాకీ కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పాకిస్థాన్ పోలీసు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియంకు వెళ్లేదారిలో ఇతర వాహనాలను అనుమతించలేదు. ఇంగ్లండ్ ప్లేయర్లు అరగంట పాటు నెట్ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టు కూర్పులో చిన్న మార్పు చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ స్థానంలో మార్క్‌వుడ్‌ను తీసుకుంది.
ఇక 2009 మార్చిలో పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ టీమ్ మీద కొందరు దుండగులు కాల్పులు జరిపారు. శ్రీలంక ఆటగాళ్లు బస్సులో వెళ్తుండగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో 12 మంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్థాన్ పోలీసులు, ఇద్దరు పౌరులు చనిపోయారు. అందుకనే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు భారత్ సహా మిగతా దేశాలు ఆలోచిస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment