రియాన్ రెకెల్టన్ పరుగుల విధ్వంసం (PC: SAT20 X)
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న పర్ల్ రాయల్స్‌కు ఎంఐ కేప్‌టౌన్ షాకిచ్చింది. సీజన్ ఆరంభం నుంచి వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన మిల్లర్ బృందానికి తొలి ఓటమిని రుచి చూపించింది.
వికెట్ కీపర్ బ్యాటర్ రియాన్ రెకెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో కేప్‌టౌన్‌కు ఈ విజయం సాధ్యమైంది. సొంత మైదానం న్యూల్యాండ్స్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ కేప్‌టౌన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
స్పిన్ ఆల్‌రౌండర్ థామస్ కెబర్ మూడు కీలక వికెట్లు తీసి పర్ల్ రాయల్స్‌ను దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఓలీ స్టోన్, జార్జ్ లిండే, కగిసో రబడ, సామ్ కరన్ ఒక్కో వికెట్ తీశారు.
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పర్ల్ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ఎంఐ కేప్‌టౌన్‌కు ఓపెనర్లు రాసీ వాన్ డర్ డసెన్(28 బంతుల్లో 41), రియాన్ రెకెల్టన్ అద్భుత ఆరంభం అందించారు.
రెకెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇక.. వన్‌డౌన్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్(10) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ కానర్(17*), రియాన్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఎంఐ కేప్‌టౌన్.. పర్ల్ రాయల్స్ మీద 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. రియాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
గెలుపు అనంతరం ఎంఐ కేప్‌టౌన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘‘మంచి ఆరంభం ఇవ్వాలని ఓపెనర్లకు చెప్పాము. రెకెల్టన్ అద్భుతం చేశాడు. అతడికి మేము అవకాశం ఇచ్చాం. పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిభకు ఆకాశమే హద్దు’’ అంటూ రియాన్ రెకెల్టన్‌ను ప్రశంసించాడు.
Comments
Please login to add a commentAdd a comment