
రిషభ్ పంత్
గతంలో నాకూ యాక్సిడెంట్ అయింది.. అప్పటి నుంచి: టీమిండియా దిగ్గజం
Rishabh Pant Car Accident: ‘‘మీకో మంచి కారు ఉంటుంది. అత్యంత వేగంగా రయ్‌మని దూసుకుపోగలదు కూడా! కానీ ఆచితూచి వ్యవహరించాలి. డ్రైవర్‌ను పెట్టుకునే స్థోమత మీకు ఉంటుంది. కాబట్టి ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లకండి. అయితే, ఒక్కొక్కరికి ఒక్కో విషయం పట్ల ఆసక్తి ఉంటుంది. ప్యాషన్ ఉంటుంది. యవ్వనంలో ఉన్నపుడు ఇలాంటివి సహజం. కానీ మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి.
ఏదేమైనా మీ పట్ల మీరే శ్రద్ధ వహించాలి. మీకేం కావాలో.. భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోగలగాలి. అంతా సాఫీగా ఉండాలంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి’’ అని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ యువ క్రికెటర్లకు సూచించాడు. డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తవహించాలని విజ్ఞప్తి చేశాడు.
కాగా టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రాణాలతో బయటపడ్డ అతడికి చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
థాంక్ గాడ్! పంత్ బయటపడ్డాడు
పంత్ క్షేమంగా బయటపడటం పట్ల హర్షం వ్యక్తం చేసిన కపిల్ దేవ్.. ఏదేమైనా వాహనాలు నడిపే సమయంలో ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అదే విధంగా గతంలో తనకు ఎదురైన అనుభవాలు పంచుకున్నాడు.
‘‘నేను క్రికెట్ ఆడుతున్న తొలినాళ్లలో మోటార్ సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాను. ఆ తర్వాత నుంచి నా సోదరుడు నన్ను మోటార్ బైక్ నడిపేందుకు అస్సలు అనుమతి ఇవ్వలేదు’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకోగలిగారని పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు
BBL: సంచలన క్యాచ్.. బిక్క ముఖం వేసిన బ్యాటర్! ఇంతకీ అది సిక్సరా? అవుటా?