PC: IPL Twitter
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ లీగ్ దశలోనే ముగిసింది. కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుందని అంతా అనుకున్న వేళ ముంబై ఇండియన్స్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరోక్షంగా ప్రధాన కారణమయ్యాడు. గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్లే చాన్స్ ఉండడంతో పంత్‌పై తీవ్ర ఒత్తిడి ఉండడం సహజం. దానిని తట్టుకొని నిలబెడితేనే ఫలితం వస్తుంది. అప్పటికే ఒత్తిడిలో సింపుల్ క్యాచ్ మిస్ చేసిన అతను రివ్యూ తీసుకోవడంలోనూ విఫలమయ్యాడు. ఇదే మ్యాచ్‌కు ఒక రకంగా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఔట్ విషయంలో పంత రివ్యూ తీసుకోకపోవడం.. ఫలితంగా గోల్డెన్ డక్ అవ్వాల్సిన బ్యాట్స్‌మన్ ఆ తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చకచకా జరిగిపోయాయి.
విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ శార్దూల్ ఠాకూర్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతికి శార్దూల్.. అప్పటికే కుదురుకున్న డెవాల్డ్ బ్రెవిస్‌ను(25 పరుగులు) ఔట్ చేశాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్ గుడ్ లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ అవతల బంతిని విసిరాడు. టిమ్ డేవిడ్ బంతిని కవర్స్ దిశగా పుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ పక్కనుంచి వెళ్లి కీపర్ పంత్ చేతుల్లో పడింది. బ్యాట్‌కు తాకినట్లు శబ్ధం రావడంతో పంత్ ఔట్‌కు అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ తగల్లేదంటూ నాటౌట్ ఇచ్చాడు.
అయితే పంత్ తీరు చూసి కచ్చితంగా రివ్యూ తీసుకుంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పంత్ రివ్యూకు వెళ్లలేదు. శార్దూల్‌తో సుధీర్ఘ చర్చ అనంతరం డీఆర్‌ఎస్ కోరకుండానే వెనక్కి వచ్చేశాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లకుండా పంత్ ఎంత పెద్ద తప్పు చేశాడో మరుక్షణంలోనే తెలిసిపోయింది. ఒక బంతి పూర్తైన తర్వాత రిప్లేలో బ్యాట్‌కు బంతి తాకినట్లుగా అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ కనిపించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా గోల్డెన్ డక్ నుంచి బతికిపోయిన టిమ్ డేవిడ్ ఆ తర్వాత 11 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో విధ్వంసం సృష్టించి 34 పరుగులు చేశాడు. ఒక రకంగా మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ చేతిలోకి రావడంలో టిమ్ డేవిడ్‌ది కీలకపాత్ర,. ఆ తర్వాత అతను ఔటైనా రమన్‌దీప్ సింగ్ ముంబైని గెలిపించి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ ఆశలను చిదిమేశాడు.
అయితే పంత్ ఆ రివ్యూ తీసుకొని ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది. టిమ్ డేవిడ్ గోల్డెన్ డక్ అయి ఉంటే ముంబై కచ్చితంగా ఓడిపోయేది.. ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ రిషబ్ పంత్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. పనికిమాలిన విషయాల్లో తలదూర్చే పంత్.. అసలు విషయంలో మాత్రం చతికిలపడ్డాడు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు దూరమవ్వడానికి ప్రధాన కారణం రిషబ్ పంత్.. కెప్టెన్‌గా పంత్ పనికిరాడు.. రివ్యూ తీసుకొని ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: IPL 2022: పాత గాయాన్ని గుర్తుపెట్టుకొని చావుదెబ్బ తీసింది..
Comments
Please login to add a commentAdd a comment