టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేసిన రిషబ్.. తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.
టెస్టుల్లో 6వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రిషబ్ పంత్ 2022 డిసెంబర్‌లో ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి అతను కోలుకున్న తీరు నమ్మలేనిది. కేవలం రెండేళ్లలోనే పూర్తి ఫిట్‌నెస్ సాధించి దుమ్ములేపుతున్న పంత్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
వసీం అక్రమ్ వంటి దిగ్గజాలు సైతం ఈ ఢిల్లీ ఆటగాడిని పొగడ్తలతో ముంచెత్తాడు. పంత్‌ను మిరాకిల్ కిడ్ అని వసీం కొనియాడాడు. తాజాగా ఈ జాబితాలోకి మరో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేరాడు. భారత జట్టులో వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారని, భవిష్యత్తులో భారత టెస్టు జట్టును పంత్ లీడ్ చేస్తాడని కనేరియా జోస్యం చెప్పాడు.
"ప్రస్తుత భారత జట్టును చూస్తుంటే ముచ్చటేస్తోంది. జట్టు విజయాల్లో ప్రతీ ప్లేయర్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి అద్భతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే భారత్ ప్రపంచ స్థాయి జట్టుగా నిలిచింది.
రిషబ్ పంత్ భవిష్యత్తులో టెస్టుల్లో భారత జట్టుకు కచ్చితంగా సారథ్యం వహిస్తాడు. అతడు పునరాగమనం తర్వాత చాలా బాగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్‌గా అతడు ఎప్పుడూ బౌలర్లు, ఫీల్డర్‌లతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయడంతో మైదానంలో అందరూ చురుగ్గా ఉంటారు. నిజంగా భారత క్రికెట్ నుంచి బుల్లెట్ వంటి చురుకైన ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు" అని ఐఎఎన్‌స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment