ఆటలో దూకుడెక్కువ.. కానీ ఆ దూకుడే అతనికి బలహీనంగా మారింది. జట్టు నుంచి తీసేస్తారు అన్న దశలో మళ్లీ ఒక మంచి ఇన్నింగ్స్‌తో మెరిసి కొన్నాళ్లపాటు జట్టులో కొనసాగడం. ఇదే అలవాటుగా మారిపోయింది. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు.. కానీ గుడ్డిగా నమ్మలేం. ధోనీ వారసుడిగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ గురించి ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయాలు. కానీ ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో తనపై వస్తున్న విమర్శలకు, అభిప్రాయాలకు సమాధానం చెప్పాడు.
మాంచెస్టర్‌తో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టాపార్డర్ విఫలమైన వేళ పాండ్యాతో కలిసి పంత్ ఇన్నింగ్స్ ఆడిన విధానం హైలైట్ అని చెప్పొచ్చు. తన వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించడమేగాక టీమిండియాకు సిరీస్‌ను అందించాడు. తనపై ఉన్న అపవాదును పంత్ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో పూర్తిగా తుడిచిపెట్టేశాడనే చెప్పొచ్చు. వాస్తవానికి రిషబ్ బ్యాటింగ్‌లో ముందు నుంచి ఎలాంటి బలహీనత లేదు.
అతనిలో లోపించింది ఓపిక, ప్రశాంతతే. అనుభవం గడిస్తున్న కొద్దీ ఈ రెండు విషయాల్లో మెరుగయ్యాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడటం అలవాటు చేసుకొని ఇప్పుడు ఒక పూర్తిస్థాయి అనుభవజ్ఞుడిలా కనిపిస్తున్నాడు. మూడేండ్ల కిందట ఇదే గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో నిర్లక్ష్యమైన షాట్ ఆడి విమర్శలు ఎదుర్కొన్న పంత్ ఇప్పుడు అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు.
ఇక 2019 వరల్డ్ కప్‌లో మొదట తనను ఎంపిక చేయనప్పటికీ పంత్ బాధ పడలేదు. ‘ఒక్క రాత్రిలో అంతా మారుతుందని నేను అనుకోను. నా వయసు 21 ఏళ్లే. నేను 30 ఏళ్ల వ్యక్తిలా ఆలోచించను. కాలంతో పాటు నా ఆలోచన తీరు కూడా మారుతుంది. పరిపక్వత వస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు పంత్‌ను చూస్తుంటే మూడేండ్ల కింద అతను చెప్పిన మాటలు నిజమయ్యాయి అనిపిస్తోంది. ఇందుకు కొంత సమయం పట్టింది. తనను ప్రశాంతంగా ఉంచేందుకు కెప్టెన్ రోహిత్ లాంటి కొందరు వ్యక్తులు అవసరం అయ్యారు.
పంత్ కెరీర్లో రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ అయిన పాంటింగ్ గైడెన్స్‌లో పంత్ తన ఆలోచన తీరు మార్చుకున్నాడు. క్రికెట్‌తోనే ప్రపంచం ముగిసిపోదని.. ఆటను ఆస్వాదించాలని రిషబ్‌కు పాంటింగ్ సూచించాడు. నిజాయితీగా ఉండటం మరింత ముఖ్యమని చెప్పాడు. అలాగే, అండర్19 నుంచి ద్రవిడ్‌తో పంత్‌కు మంచి అనుబంధం ఉంది.
జట్టులో పంత్‌ను సౌకర్యవంతంగా ఉంచితే ఫలితం వస్తుందని ద్రవిడ్‌కు తెలుసు. అందుకే మొన్నటి సౌతాఫ్రికా సిరీస్‌లో పూర్తిగా ఫెయిలైనా కూడా రిషబ్‌కు ద్రవిడ్ అండగా నిలిచాడు. అతని ప్రతిభపై నమ్మకం ఉంచాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుతో పాటు ఆఖరి వన్డేలో అద్భుత సెంచరీలతో పంత్ కోచ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్న రిషబ్‌కు మంచి ఫ్యూచర్ ఉంది. అతని వయసు 24 ఏండ్లే. ఇదే నిలకడ కొనసాగిస్తే తను కెప్టెన్‌గా టీమిండియాను నడిపించే అవకాశాలూ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment