పాకిస్తాన్‌ సూపర్‌ హిట్‌ పాటను పాడిన పంత్‌.. షాకైన జహీర్‌ ఖాన్‌.. వైరల్‌ వీడియో | Rishabh Pant Sings Viral Pakistan Song Afsanay | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ సూపర్‌ హిట్‌ పాటను పాడిన పంత్‌.. షాకైన జహీర్‌ ఖాన్‌.. వైరల్‌ వీడియో

Published Sun, Mar 16 2025 4:14 PM | Last Updated on Sun, Mar 16 2025 5:20 PM

Rishabh Pant  Sings Viral Pakistan Song Afsanay

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌-2025 కోసం సన్నాహకాలు మొదలుపెట్టాడు. గత వారమంతా సోదరి వివాహ వేడుకలతో బిజీగా గడిపిన పంత్‌.. నిన్ననే తన కొత్త ఐపీఎల్‌ జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో కలిశాడు. పంత్‌ను ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్‌ గతేడాది జరిగిన మెగా వేలంలో రికార్డు ధరకు (రూ. 27 కోట్లు) సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఓ ఆటగాడికి లభించిన అత్యధిక ధర ఇదే. 

పంత్‌ను ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. గత సీజన్‌ వరకు కెప్టెన్‌గా ఉండిన కేఎల్‌ రాహుల్‌ను లక్నో యాజమాన్యం మెగా వేలానికి ముందు వదిలేసింది. రాహుల్‌ను వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసింది. లక్నో.. ఐపీఎల్‌ 2025 సీజన్‌ను మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలుపెడుతుంది. ఈ మ్యాచ్‌ విశాఖలో జరుగనుంది.

2022లో గుజరాత్‌తో పాటు ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన లక్నో మూడు సీజన్లలో ఒక్క టైటిల్‌ కూడా గెలువలేదు. తొలి రెండు సీజన్లలో మూడో స్థానంలో సరిపెట్టుకున్న లక్నో.. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసి ఏడో స్థానంలో నిలిచింది. కొత్త కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ నాయకత్వంలో ఈ సారైనా టైటిల్‌ సాధించాలని లక్నో అభిమానులు కోరుకుంటున్నారు. మరి పంత్‌ లక్నో ఆశలను నిజం చేస్తాడో లేక నీరుగారుస్తాడో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే, పంత్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పంత్‌ పాకిస్తాన్‌ సూపర్‌ హిట్‌ పాట 'అఫ్సానే'ను పాడుతూ కనిపించాడు. పాకిస్తానీ బ్యాండ్‌ యంగ్‌ స్టన్నర్స్‌కు చెందిన  ఈ పాటను పంత్‌ అద్భుతంగా పాడాడు. పంత్‌లో సింగింగ్‌ టాలెంట్‌ చూసి లక్నో మెంటార్‌ జహీర్‌ ఖాన్‌ షాక్‌కు గురయ్యాడు. పంత్‌ పాట పాడుతుండగా జహీర్‌ అతన్ని చూస్తూ ఉండిపోయాడు. 

దీనికి సంబంధించిన వీడియోను లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం తమ సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది. ఈ వీడియోకు పార్ట్‌ టైమ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌.. ఫుల్‌ టైమ్‌ కరావోకే సింగర్‌ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. పంత్‌ సింగింగ్‌ టాలెంట్‌కు జనాలు ముగ్దులవుతున్నారు. చిన్న పిల్లాడిలా, ఎప్పుడూ ఏదో ఒక కోతి పని చేస్తూ ఉండే పంత్‌లో ఇంత టాలెంట్‌ ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

కాగా, 27 ఏళ్ల పంత్‌ 2022వ సంవత్సరం చివర్లో కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పంత్‌ కెరీర్‌ ముగుస్తుందని అంతా అనుకున్నారు. అయితే పంత్‌ మొక్కవోని మనో ధైర్యంతో గాయాలను జయించి పునర్జన్మ సాధించాడు. రీఎంట్రీలో పంత్‌ గతం కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన పంత్‌.. ఆ సీజన్‌లో ఢిల్లీ తరఫున లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పంత్‌ భారత జట్టుకు కూడా ఎంపికై టీ20 వరల్డ్‌కప్‌-2025, ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచాడు.

2016లో ఐపీఎల్‌ కెరీర్‌ ప్రారంభించిన పంత్‌.. వరుసగా ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. పంత్‌ ఐపీఎల్‌లో 111 మ్యాచ్‌లు ఆడి 148.93 స్ట్రయిక్‌రేట్తో3284 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 18 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

2025 సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు..
రిషబ్‌ పంత్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, హిమ్మత్‌ సింగ్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, ఆయుశ్‌ బదోని, అబ్దుల్‌ సమద్‌, యువరాజ్‌ చౌదరీ, షాబాజ్‌ అహ్మద్‌, మిచెల్‌ మార్ష్‌, అర్శిన్‌ కులకర్ణి, ఆర్‌ఎస్‌ హంగార్గేకర్‌, మాథ్యూ బ్రీట్జ్కీ, నికోలస్‌ పూరన్‌, ఆర్యన్‌ జుయల్‌, రవి భిష్ణోయ్‌, మయాంక్‌ యాదవ్‌, ఆకాశ్‌దీప్‌, మణిమారన్‌ సిద్దార్థ్‌, షమార్‌ జోసఫ్‌, ఆవేశ్‌ ఖాన్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మొహిసిన్‌ ఖాన్‌, ఆకాశ్‌ మహారాజ్‌ సింగ్‌, దిగ్వేశ్‌ రతీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement