భారత బ్యాటర్స్ గర్జనకు తొలి రోజే శ్రీలంక డీలా పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఇచ్చిన చక్కని ఆరంభంతో తొలి టెస్టు ఆట పరుగుల బాట పట్టింది. తుది జట్టులోకి తీసుకోగానే హనుమ విహారి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కోహ్లి కుదురుగా ఆడాడు. వీళ్లంతా టెస్టు ఆడితే రిషభ్ పంత్ ఒక్కడు మెరుపులతో టి20 ఆడుకున్నాడు. దీంతో రోజంతా ప్రత్యర్థి బౌలర్లకు అలసట తప్పలేదు. ఓవరాల్‌గా తొలి రోజును భారత పరుగులు, మెరుపులు శాసించాయి.
మొహాలి: పొట్టి పోరులో శ్రీలంకను ఊడ్చేసిన భారత్... అదే జోరుతో సంప్రదాయ ఆటను సాధికారంగా ప్రారంభించింది. ప్రత్యర్థి బౌలర్లను సులువుగా ఎదుర్కొంది. ప్రత్యేకమైన ‘100వ’ టెస్టులో కోహ్లి (45; 5 ఫోర్లు) మెరుగైన స్కోరు చేయగా, టెస్టు స్పెషలిస్టు హనుమ విహారి (58; 5 ఫోర్లు) తన విలువేంటో బ్యాట్‌తోనే చెప్పాడు. వీరందరికీ భిన్నంగా రిషభ్ పంత్ (97 బంతుల్లో 96; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈ టెస్టు మొదటి రోజును మెరుపులతో మురిపించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
జడేజా (45 బ్యాటింగ్), అశ్విన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్, మయాంక్ తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించి చక్కని ఆరంభమే ఇచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో వన్డేలాగే 9.3 ఓవర్లలోనే భారత్ స్కోరు 50కి చేరింది. మరుసటి బంతికే రోహిత్ (29; 6 ఫోర్లు) కాసేపయ్యాక మయాంక్ (33; 5 ఫోర్లు) పెవిలియన్ చేరారు. తర్వాత విహారి, కోహ్లిల భాగస్వామ్యం భారీస్కోరుకు బాటవేసింది. ఫిఫ్టీకి సమీపించిన కోహ్లిని ఎంబుల్దెనియా బౌల్డ్ చేశాడు. విహరిని ఫెర్నాండో అవుట్ చేశాడు.
పంత్ అంతే!
ఫార్మాట్ ఏదైనా పంత్ తన ఆట మారదని బ్యాట్‌తో మళ్లీ చాటాడు. 44వ ఓవర్లో కోహ్లి అవుటయ్యాక పంత్ క్రీజులోకి వచ్చాడు. రెండు కీలక వికెట్లు స్వల్ప వ్యవధిలోనే పడిపోయినా... పంత్ ఎప్పట్లాగే తనశైలి ఆట ఆడుకున్నాడు. అతనికి అయ్యర్ జతకాగా, 2 వికెట్లు తీసిన ఉత్సాహంతో ఉన్న ఎంబుల్దెనియాకు పంత్ తన సిక్సర్ రుచి చూపాడు. కాసేపు నెమ్మదించిన ఈ డాషింగ్ వికెట్ కీపర్ అడపాదడపా బౌండరీలతో ఫిఫ్టీ (73 బంతుల్లో; 4 ఫోర్లు, 1 సిక్స్) చేరుకున్నాడు. అప్పటిదాకా వన్డే ఆడిన పంత్ ఒక్కసారిగా టి20కి మారిపోయాడు. ఎంబుల్దెనియా వేసిన 76వ ఓవర్లో వరుసగా 6, 6, 4, 0, 2, 4లతో 22 పరుగులు పిండేశాడు.
దెబ్బకు ఓవర్ వ్యవధిలోనే అతని స్కోరు 72 అయ్యింది. ధనంజయ డిసిల్వా వేసిన మరుసటి ఓవర్లోనూ 4, 6 కొట్టి 80 దాటాడు. జట్టు స్కోరు కూడా 300 అధిగమించింది. ఇక స్వల్పవ్యవధిలోనే పంత్ మరో రెండు బౌండరీలు కొట్టడంతో సెంచరీ ఖాయమ నుకున్నారంతా! కానీ లక్మల్ నేరుగా సంధించిన బంతిని సరిగా అంచనా వేయలేక పంత్ బౌల్డయ్యాడు. 4 పరుగుల దూరంలో శతకావకాశాన్ని కోల్పోయినప్పటికీ చివరి 46 పరుగుల్ని కేవలం 24 బంతుల్లోనే బాదడం విశేషం.
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎంబుల్దెనియా 33; రోహిత్ శర్మ (సి) లక్మల్ (బి) కుమార 29; హనుమ విహారి (బి) ఫెర్నాండో 58; కోహ్లి (బి) ఎంబుల్దెనియా 45; పంత్ (బి) లక్మల్ 96; శ్రేయస్ అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) డిసిల్వా 27; రవీంద్ర జడేజా (బ్యాటింగ్) 45; అశ్విన్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (85 ఓవర్లలో 6 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–52; 2–80, 3–170, 4–175, 5–228, 6–332. బౌలింగ్: లక్మల్ 16–1–63–1, విశ్వ ఫెర్నాండో 16–1–69–1, లహిరు కుమార 10.5–1–52–1, ఎంబుల్దెనియా 28–2–107–2, ధనంజయ డిసిల్వా 11–1–47–1, అసలంక 3.1–0–14–0.
Comments
Please login to add a commentAdd a comment