
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగే ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతి కల్పించి, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే జట్టులో ప్రస్తుత దేశవాలీ క్రికెట్ సెన్సేషన్ రియాన్ పరాగ్‌కు స్థానం పక్కా అని సమాచారం.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు (అస్సాం కెప్టెన్‌గా) చేసి, భీకర ఫామ్‌లో ఉన్న రియాన్ సైతం భారత సెలక్టర్ల నుంచి పిలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.
ముస్తాక్ అలీ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన రియాన్ 85.00 సగటున, 182.79 స్ట్రైక్ రేట్‌తో 510 పరుగులు చేసి టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో రియాన్ 11 వికెట్లు కూడా పడగొట్టాడు. రియాన్ తన అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రతిభతో, కెప్టెన్సీ స్కిల్స్‌తో అస్సాంను సెమీస్ వరకు తీసుకెళ్లాడు. అయితే సెమీస్‌లో రియాన్‌తో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో అస్సాం టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ టోర్నీకి ముందు జరిగిన దియోదర్ ట్రోఫీలోనూ భీకర ఫామ్‌లో ఉండిన రియాన్ (ఈస్ట్ జోన్).. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి 88.50 సగటున 136.67 స్ట్రైక్ రేట్ 136.67తో రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 354 పరుగులు చేశాడు. ఈ టోర్నీలోనూ రియాన్ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు. ఈ టోర్నీలో అతను 19.09 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని రియాన్‌ను భారత జట్టుకు ఎంపిక చేయడం ఖాయమని నెటిజన్లు అనుకుంటున్నారు. 21 ఏళ్ల రియాన్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.