శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అండర్-19 క్రికెటర్, ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ సెంచరీతో మెరిశాడు. తద్వారా ఫ్లింటాఫ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రాకీ ఫ్లింటాఫ్ రికార్డులకెక్కాడు.
ఫ్లింటాప్ కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 181 బంతులు ఎదుర్కొన్న రాకీ.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫ్లింటాఫ్ తన అద్బుత సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
అతడితో పాటు కెప్టెన్ హాంజా షేక్(107) సెంచరీతో రాణించాడు. అంతకుముందు శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో వీరసింఘే(77) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో నవ్య శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మోర్, బర్నాడ్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఇక మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 324 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన లంక మూడో రోజు లంచ్ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment