అడిలైడ్: నాలుగు పదుల వయసు దాటినా తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపిస్తూ భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్‌లో 20వ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (8/6), 6–1తో టాప్ సీడ్ మార్సెలో మెలో (బ్రెజిల్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీపై సంచలన విజయం సాధించింది. బెంగళూరుకు చెందిన 41 ఏళ్ల బోపన్న కెరీర్‌లో ఇది 20వ డబుల్స్ టైటిల్.
2020లో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)తో కలసి దోహా ఓపెన్ టైటిల్ సాధించాక బోపన్న ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే కావడం విశేషం. మరోవైపు చెన్నైకి చెందిన 27 ఏళ్ల రామ్‌కుమార్ కెరీర్‌లో ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్‌లో బోపన్న–రామ్‌కుమార్ కలసి ఆడటం ఇదే ప్రథమం. 55 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నాయి. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో భారత జోడీ పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో మాత్రం భారత జంట ఆధిపత్యం కనబరిచింది. రెండుసార్లు ప్రత్యర్థి జోడీ సర్వీస్‌లను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.
విజేతగా నిలిచిన బోపన్న–రామ్‌కుమార్ జంటకు 18,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 13 లక్షల 89 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. నేడు మొదలయ్యే అడిలైడ్ ఓపెన్–2 టోర్నీలో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)తో కలసి బోపన్న బరిలో దిగుతుండగా... మరోవైపు రామ్‌కుమార్‌తోపాటు భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, యూకీ బాంబ్రీ మెల్‌బోర్న్‌లో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడనున్నారు.
చదవండి: సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment