మహ్మద్ సిరాజ్
India vs New Zealand, 1st ODI- Mohammed Siraj- Hyderabad: హైదరాబాద్.. మాసాబ్‌ట్యాంక్ సమీపంలో ఖాజానగర్‌లో ఓ ఇరుకైన అద్దె ఇల్లు.. ఓ ఆటో డ్రైవర్ తన కుటుంబంతో కలిసి జీవించే వాడు. కష్టపడి పెద్ద కొడుకును ఇంజనీరింగ్ చదివించలిగాడు. ఇక చిన్నోడు.. తనకేమో ఆటే ప్రపంచం.. క్రికెట్ అంటే పిచ్చిప్రేమ.. పెద్దోడు ఎలాగోలా సెటిల్ అవుతాడు.. మరి ఈ చిన్నోడి పరిస్థితి ఏమవుతుందోనని తల్లి ఆందోళన.
ఆటో డ్రైవర్‌గా అరకొర సంపాదనతో ఎన్నాళ్లు నెట్టుకురావాలో తెలియని దీనస్థితిలో ఉన్న తండ్రిని చూసి చిన్నోడు తట్టుకోలేకపోయాడు. వేన్నీళ్లకి చన్నీళ్లు తోడన్నట్లు ఇళ్లకు పెయింట్ వేసే పని కూడా చేసేందుకు సిద్ధపడ్డాడు. కానీ ఎప్పుడూ ఆటను వదల్లేదు.
సహజ ప్రతిభ
పూర్తిస్థాయిలో మెళకువలు నేర్వకముందే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్న ఈ హైదరాబాదీ సహజ ప్రతిభ అతడి గుర్తింపునకు కారణమైంది. లీగ్ స్థాయి క్రికెట్‌లో సత్తా చాటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్ల దృష్టిలో పడి.. అండర్-23 జట్టు తరఫున సత్తా చాటడం వరకు అద్నాన్, మహబూబ్ అహ్మద్ వంటి కోచ్‌ల సహకారం ఉంది.
అందుకు ముందడుగు
అంచెలంచెలుగా ఎదుగుతూ రంజీల్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు ఆ కుర్రాడు. దేశవాళ్లీ క్రికెట్‌లో సత్తా చాటాడు. కొడుకు ప్రతిభ చూసి ఆ తండ్రి మురిసిపోయాడు. ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడతాడని, గొప్ప క్రికెటర్‌గా పేరు సంపాదిస్తాడని ఆయన భావించాడు. అందుకు ముందడుగు అన్నట్లు 22 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది.
దశ తిరిగింది
ప్రతిభావంతుడైన ఆ యువ పేసర్‌ను 2017 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 2.6 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో ఆ కుర్రాడి దశ తిరిగింది. తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన ఆ ఫాస్ట్‌బౌలర్.. 2017లో న్యూజిలాండ్‌తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ప్రఖ్యాత మైదానంలో
2019లో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, 2020లో ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ సంచలనం సృష్టించాడు. అరంగేట్రంలోనే 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
సీనియర్ మహ్మద్ షమీ స్థానంలో తుది జట్టులో అవకాశం దక్కించుకున్న అతడు.. మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అప్పటి నుంచి టీమిండియా పేస్ విభాగంలో కీలక బౌలర్‌గా ఎదుగుతూ.. ఇప్పుడు సొంత మైదానంలో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు.
ఆ ఒక్క లోటు
అయితే, కొడుకు సాధించిన ఘనతను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పుడు ఆ తండ్రి లేడు. తమను పోషించడానికి ఆటో నడిపిన ఆయనను మెర్సిడెస్‌లోనే తిప్పాలన్న ఆ కొడుకు ఆశ నెరవేరలేదు. అయితే, భౌతికంగా దూరమైనా ఆ తండ్రి ఆశీస్సులు మాత్రం కొడుక్కి మెండుగా ఉంటాయి. ఆ తండ్రి పేరు గౌస్.. తల్లి షబానా.. వాళ్ల చిన్నోడు మరెవరో కాదు మహ్మద్ సిరాజ్. జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేని లోటు తీర్చే విధంగా భారత ప్రధాన పేసర్‌గా ఎదుగుతున్న మన హైదరాబాదీ.
వికెట్ల వీరుడు!
28 ఏళ్ల మహ్మద్ సిరాజ్ ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2022 జనవరి 1 నుంచి చూస్తే 18 వన్డేల్లో అతను కేవలం 19.87 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. అసోసియేట్ జట్లను మినహాయిస్తే ఒక బౌలర్ పడగొట్టిన అత్యధిక వికెట్లు ఇవే. అదీ 4.53 ఎకానమీతో పరుగులు కూడా ఇవ్వకుండా కట్టడి చేయగలిగాడు.
42 మ్యాచ్‌ల కెరీర్ తర్వాత తన సొంత నగరంలో సిరాజ్ బుధవారం తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. అతడి ప్రతిభ, నైపుణ్యంపై మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు ఎంత నమ్మకం ఉందో.. రోహిత్ శర్మ ప్రెస్‌మీట్ చూసిన వాళ్లకు అర్థమయ్యే ఉంటుంది.
మూడు ఫార్మాట్‌లలో కీలకం
కివీస్‌తో ఉప్పల్‌లో తొలి మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతనిపై ప్రత్యేక ప్రశంసలు కురిపించడం విశేషం. జట్టులో సిరాజ్ విలువేమిటో చెబుతూ అతనికి బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘సిరాజ్ గత కొంత కాలంగా మూడు ఫార్మాట్‌లలో ఎంతో మెరుగయ్యాడు. లైన్ అండ్ లెంగ్త్ ఎంతో మెరుగైంది. ముఖ్యంగా అవుట్ స్వింగ్‌లో పదును పెరిగింది. కొత్త బంతితో బంతిని స్వింగ్ చేయడం అంత సులువు కాదు.
కెప్టెన్ ప్రశంసల జల్లు
ఈ విషయంలో అతను ఎంతో నైపుణ్యం సంపాదించాడు. అలాంటి బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఏ బ్యాటర్‌కైనా చాలా కష్టం. సరిగ్గా చెప్పాలంటే తన బౌలింగ్‌ను అతను అర్థం చేసుకోవడంతో పాటు జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందో కూడా గుర్తించాడు. ఆరంభంలో, మధ్య ఓవర్లలో వికెట్లు తీయగల సత్తా అతనిలో ఉంది. రాన్రానూ అతని గ్రాఫ్ మరింత పైకి వెళుతోంది.
సిరాజ్‌ను సరైన రీతిలో మేనేజ్ చేయడం మాకు అవసరం. వరల్డ్‌కప్, త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం అతడికి తగిన విరామాలు ఇస్తూ సరైన రీతిలో ఉపయోగించుకుంటాం. హోం గ్రౌండ్ మ్యాచ్‌లో అతనికి బెస్ట్ విషెస్’ అని రోహిత్ అన్నాడు. మనం కూడా మన హైదరాబాదీ కుర్రాడికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం!!
చదవండి: Womens U19 World Cup: హైదరాబాద్ అమ్మాయికి బంపరాఫర్.. భారత జట్టులో చోటు
🗣️🗣️'Siraj is an important player for India'
— BCCI (@BCCI) January 17, 2023
Hear what #TeamIndia captain @ImRo45 has to say on local lad @mdsirajofficial ahead of the first #INDvNZ ODI in Hyderabad pic.twitter.com/XoSSOplZ20
Comments
Please login to add a commentAdd a comment