ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా రన్నరప్‌కే పరిమితమైంది. అయితే జట్టు ప్రదర్శన కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టెస్టు కెప్టెన్‌గా రోహిత్ పనికిరాడని.. వెంటనే అతన్ని తొలగించాలని అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.
కాగా బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మకు అండగా నిలబడినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు, వన్డే, టి20 సిరీస్‌కు బీసీసీఐ సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. కాగా డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో విఫలమైన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి విండీస్‌తో టెస్టు సిరీస్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తారని అంతా ఊహించారు.
పీటీఐ సమాచారం మేరకు విండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్ తర్వాతే రోహిత్ కెప్టెన్సీ భవితవ్యం తేలనుంది.
ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ''రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహితే కెప్టెన్‌గా ఉంటాడు. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన, కెప్టెన్సీని బోర్డు సూక్ష్మదృష్టితో పరిశీలిస్తుందని.. రోహిత్ ఇచ్చే ప్రదర్శనతో అతని కెప్టెన్సీపై గవర్నింగ్ బాడీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికైతే టీమిండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ'' అంటూ పేర్కొన్నాడు.
Rohit Sharma likely to captain India for the West Indies Test series. He'll sit with the BCCI later to decide on his future as Test captain. (Reported by PTI). pic.twitter.com/tbs5bGSImv
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 13, 2023
కాగా జూలై 12 నుంచి విండీస్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టులకు, వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ జట్టుతో ఆడనుండగా.. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కోహ్లి, రోహిత్ సహా మరికొంత మంది సీనియర్లు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక టి20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నేతృత్వం వహించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment