Rohit Sharma Finally Reveals Why He And Kohli Not Playing T20Is For India - Sakshi
Sakshi News home page

Rohit- Virat: నేను, కోహ్లి అందుకే ఆడటం లేదు.. అయినా జడ్డూ గురించి ఎందుకు అడగరు: రోహిత్‌

Published Fri, Aug 11 2023 2:22 PM | Last Updated on Fri, Aug 11 2023 2:44 PM

Rohit Sharma Finally Reveals Why He And Kohli Not Playing T20Is For India - Sakshi

Rohit Sharma- Virat Kohli: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఈ ఏడాది ఇంత వరకు ఒక్క టీ20 మ్యాచ్‌ కూడా ఆడలేదు. రోహిత్‌ గైర్హాజరీ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో హార్దిక్‌ పాండ్యా భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన టీమ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లలో నాయకత్వం వహిస్తున్నాడు.

ఐపీఎల్‌ స్టార్లకు అవకాశాలు
తాజాగా వెస్టిండీస్‌ సిరీస్‌లోనే పాండ్యానే కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌-2024 నాటికి పూర్తిస్థాయి జట్టును సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతోనే సీనియర్లను పక్కనపెట్టి ఐపీఎల్‌తో రాటుదేలిన యువ ‘స్టార్ల’ను పరీక్షించాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్‌ ప్రయోగాలు చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడు కూడా ఇలాగే చేశాం
ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను, కోహ్లి టీ20లు ఎందుకు ఆడటం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘గతేడాది కూడా మేము ఇలాంటి పంథానే అనుసరించాం. టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు వన్డే క్రికెట్‌కు దూరంగా ఉన్నాం. ఇప్పుడు కూడా అదే అనుసరిస్తున్నాం.

వన్డే వరల్డ్‌కప్‌ ముందుంది కాబట్టి టీ20లు ఆడటం లేదు. మెగా ఈవెంట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం రెండేళ్ల క్రితమే ప్రణాళిక రచించాం’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

జడేజా గురించి అడగరెందుకు?
ఇక కేవలం తమను మాత్రమే హైలైట్‌ చేస్తున్నారని ప్రశ్నించిన రోహిత్‌.. ‘‘రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లు ఆడటం లేదు. కానీ మీరెందుకు అతడి గురించి అడగరు? నాపై, విరాట్‌పైనే మీ దృష్టి మొత్తం ఉంటుందని నాకు తెలుసు. అయితే, జడేజా కూడా ఆడటం లేదన్న విషయాన్ని గుర్తించాలి కదా!’’ అని రిపోర్టర్‌కు కౌంటర్‌ ఇచ్చాడు.

ఆసియా కప్‌లో మళ్లీ
కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడిన ‘విరోహిత్‌’ ద్వయం.. తదుపరి ఆసియా కప్‌-2023 సందర్భంగా మళ్లీ బరిలోకి దిగనుంది. ఆగష్టు 30 నుంచి మొదలుకానున్న వన్డే ఫార్మాట్‌ ఈవెంట్‌లో రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి కూడా మైదానంలో దిగనున్నాడు.

శ్రీలంక, పాకిస్తాన్‌లలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ముగిసిన తర్వాత.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడనుంది టీమిండియా. ఆపై అక్టోబరు 5- నవంబరు 19 వరకు సొంతగడ్డపై జరుగనున్న ప్రపంచకప్‌ ఈవెంట్లో అమీతుమీ తేల్చుకోనుంది.  

చదవండి: అయ్యో.. అంబటి రాయుడులాగే అతడి కెరీర్‌ కూడా అర్ధంతరంగానే! తిరిగి వస్తే అంతే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement